- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Aap lost: లిక్కర్ స్కామ్, శీశ్ మహల్.. ఆప్ ఓటమికి ప్రధాన కారణాలివే !

దిశ, నేషనల్ బ్యూరో: అవినీతిని అంతం చేయడమే ప్రధాన ఎజెండా అనే అంశంతో రాజకీయాలు ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) ఢిల్లీలో ప్రభంజనమే సృష్టించింది. మొదటి ఎన్నికల్లో పెద్ద విజయం సాధించకపోయినా గత రెండు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అంతేగాక ఆ తర్వాత పంజాబ్‌లోనూ పట్టు సాధించి అధికారంలోకి వచ్చింది. కానీ ప్రస్తుత ఢిల్లీ ఎన్నికల్లో చతికిలబడింది. భారీగా సీట్లు కోల్పోయి అధికారాన్ని చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఆప్ ఓటమికి గల ప్రధాన కారణాలను తెలుసుకుందాం.
మద్యం కుంభకోణం
దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor scam) సంచలనం సృష్టించింది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈడీ, సీబీఐలు కేసు నమోదు చేయగా ఏకంగా ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు ఈ ఆరోపణలతో జైలుకు వెళ్లారు. ఆరు నెలలకు పైగా కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. ఈ అంశమే ఆప్‌పై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అవినీతి అంతం అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చిన కేజ్రీవాల్ చివరకు అదే కుంభకోణంలో చిక్కుకోవడమే కారమని చెబుతున్నారు.
శీశ్ మహల్ నిర్మాణం
సామాన్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేజ్రీవాల్ అధికారంలోకి రాగానే తన అధికారిక నివాసమైన శీశ్ మహల్ కట్టడానికి ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపణలున్నాయి. దీని పునరుద్దరణకు దాదాపు రూ.33 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కాగ్ నివేదిక సైతం ఈ అంశాన్ని ఎన్నికల ముందే వెల్లడించింది. దీంతో కేజ్రీవాల్ సామాన్యుడు అనే ఇమేజ్‌ను మార్చివేసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ దీనిని ప్రచారాస్త్రంగా ముందుకు తీసుకెళ్లింది. ఆ పార్టీకి చెందిన ప్రతి నాయకుడూ తన ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో కేజ్రీవాల్‌పై ప్రజా వ్యతిరేకత మొదలైంది.
వాగ్దానాల అమలులో విఫలం
ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో అరవింద్ కేజ్రీవాల్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో అధికారాన్ని కోల్పవడానికి ఇది కూడా దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ మహిళా ఓటర్లకు పలు హామీలు గుప్పించారు. అయితే అంతకుముందు ఇచ్చిన వాటిని ఆయన నెరవేర్చలేదని విమర్శలున్నాయి. దీంతో మహిళా ఓటర్లు సైతం ఆప్‌పై వ్యతిరేకత చూపించినట్టు తెలుస్తోంది.
ఎల్జీతో నిరంతర పోరాటం
ఢిల్లీలో, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నాయకుల మధ్య చర్చ చాలా కాలం పాటు కొనసాగింది. ప్రభుత్వ విధానం, అధికార యంత్రాంగంపై నియంత్రణ, ప్రజా సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై లెఫ్టినెంట్ గవర్నర్‌తో నిరంతరం ఘర్షణ జరిగింది. గత పాలనలో ఈ వివాదం మరింత తీవ్రమైంది. ప్రతి విషయంలో కేజ్రీవాల్ ఎల్జీని విమర్శిస్తూ వచ్చారు. దీంతో అభివృద్ధిని దీని వల్ల పార్టీకి నష్టం వాటిల్లింది, బీజేపీకి లాభం కలిగింది.
‘యమునా’ విష ప్రచారం
హర్యానా ప్రభుత్వం యమునా నీటిలో విషం కలుపుతోందని కేజ్రీవాల్ ఎన్నికల వేళ ఆరోపణలు గుప్పించారు. అయితే దీనికి బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. నేను ఆ నీటినే తాగుతానని ప్రధాని మోడీ స్పష్టం చేయగా, హర్యానా సీఎం ఏకంగా యమునా నది నీళ్లను తాగారు. దీంతో కేజ్రీవాల్ ఆరోపణలన్నీ ఉత్తవేనని గ్రహించిన ఓటర్లు వ్యతిరేకత చూపించినట్టు తెలుస్తోంది.
కాలుష్య నియంత్రణలో విఫలం
ఢిల్లీలో కాలుష్యం తగ్గిస్తానని గత ఎన్నికల్లో కేజ్రీవాల్ వాగ్ధానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన అనంతరం దానికి పట్టించుకోలేదని, ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆరోపణలున్నాయి. అంతేగా ప్రస్తుత ఎన్నికల్లో మళ్లీ ఈ అంశంపై ఆప్ తన మేనిఫెస్టోలో చేర్చలేదు. దీంతో ఇది కూడా ఆప్ ఆశలకు గండికొట్టిందని భావిస్తున్నారు. అంతేగాక ఢిల్లీలో రోడ్ల పరిస్థితి, మంచినీటి సమస్య లాంటి అనేక ప్రాబ్లమ్స్ వెలుగు చూశాయి. ఈ టైంలో కేంద్ర ప్రభుత్వంపై ఆప్ విమర్శలు చేసిందే తప్ప పరిష్కార మార్గాలను అన్వేషించలేదని వాదనలు ఉన్నాయి. అంతేగాక 70 మంది అభ్యర్థులలో 28 మంది కొత్త ముఖాలను ఆప్ నిలబెట్టింది. దీంతో టికెట్ కోల్పోయిన అభ్యర్థులు ఆప్‌కు వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.