Aaditya Thackeray: బీజేపీకి ‘ఎస్పీ’ బీ టీమ్.. ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు

by vinod kumar |   ( Updated:2024-12-08 12:49:27.0  )
Aaditya Thackeray: బీజేపీకి ‘ఎస్పీ’ బీ టీమ్.. ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి నుంచి సమాజ్ వాదీ పార్టీ (Sp) వైదొలగడంపై శివసేన (UBT) నేత ఆదిత్య థాక్రే (Aaditya Thackeray) స్పందించారు. ఎస్పీ బీజేపీకి బీ టీమ్‌గా పని చేస్తోందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్పీ నేత అబూ అజ్మీ (Abhoo aajmi) చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘దీనిపై నేను ఎలాంటి ప్రకటన చేయదలచుకోలేదు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సొంతంగా ఎంతో పోరాటం చేస్తున్నారు. కానీ మహారాష్ట్రలోని కొంతమంది ఎస్పీ నాయకులు కొన్ని సమయాల్లో బీజేపీకి సహాయం చేస్తూ వారికి బీటీమ్ గా పని చేస్తున్నారు’ అని అన్నారు. గతంలోనూ అనేక పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయన్నారు.

‘హిందుత్వం కోసం నిరంతరం శ్రమిస్తాం. ఈ విషయంలో స్పష్టంగా ఉన్నాం. మేము హిందుత్వ వాదులం కాదని మేము ఎప్పుడూ చెప్పలేదు. హిందుత్వ హృదయంలో రాముడు ఉన్నాడు దానికి తగ్గట్టుగానే పని చేస్తున్నాం. ఈ భావజాలం అందరినీ ఒకదానితో ఒకటి తీసుకెళ్తుంది. బీ టీమ్‌లు మాకు నేర్పకూడదు. ఉద్ధవ్ థాక్రే అందరినీ కలిసి ముందుకు తీసుకెళ్లడం ఎప్పటి నుంచో చూస్తున్నాను’ అని తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలకు మరోసారి ఆదిత్య మద్దతిచ్చారు. ‘బ్యాలెట్ పేపర్‌పై మాక్ పోల్ ఉండాలని ప్రజలకు ఒకే ఒక డిమాండ్ ఉంది. మాక్ పోల్ దేనినీ మార్చదు’ అని చెప్పారు.

ఆదిత్య థాక్రే వ్యాఖ్యలపై ఎస్పీ ఎమ్మెల్యే రైస్ షేక్ (Rice sheik) స్పందించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆదిత్య తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై సీనియర్ నేతలతో చర్చిస్తామన్నారు. కాగా, బాబ్రీ మసీదు కూల్చివేతపపై శివసేన (యూబీటీ) నేత చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంవీఏ కూటమి నుంచి ఎస్పీ వైదొలగుతున్నట్టు ఆ పార్టీ నేత అబూ ఆజ్మీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదిత్య థాక్రే పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed