రాష్ట్రంలో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత

by Jakkula Mamatha |
రాష్ట్రంలో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత
X

దిశ,వెబ్‌డెస్క్: హర్యానా(Haryana) మాజీ మంత్రి సత్పాల్ సంగ్వాన్(83)(Former minister Satpal Sangwan) కన్నుమూశారు. ఈరోజు(సోమవారం) తెల్లవారుజామున 3 గంటలకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వివరాల్లోకి వెళితే.. సత్పాల్ సంగ్వాన్ గత కొన్ని రోజులుగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణించింది. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. చాలా రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేకపోయింది. దీంతో నేడు మరణించాడు.

ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలు ఈరోజు (మార్చి 3) మధ్యాహ్నం 2 గంటలకు దాద్రీ జిల్లాలోని ఆయన స్వగ్రామం చందేనిలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన భౌతికకాయాన్ని చివరి దర్శనం కోసం దాద్రీ నివాసంలో ఉంచారు. ఆయన మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మాజీ మంత్రి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

సత్పాల్ సంగ్వాన్ రాజకీయ ప్రయాణం..

సత్పాల్ సంగ్వాన్ రాజకీయ జీవితం సుదీర్ఘమైనది. ఆయన చర్కీ దాద్రీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు. 1996లో హర్యానా వికాస్ పార్టీ టిక్కెట్‌పై తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపోందారు. 2009లో హెచ్‌జేకే (హర్యానా జనహిత్ కాంగ్రెస్) నుంచి ఎన్నికల్లో గెలిచి రెండోసారి అసెంబ్లీకి చేరుకున్నారు. తరువాత HJK కాంగ్రెస్‌లో విలీనం చేయబడింది. దీంతో అతను భూపేంద్ర సింగ్ హుడా ప్రభుత్వంలో సహకార మంత్రిగా పనిచేశారు. సత్పాల్ సంగ్వాన్ కూడా కాంగ్రెస్, జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) పోటీ చేశారు. అతను ప్రజలలో ప్రజాదరణ పొందిన నాయకుడు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నిష్క్రమణ ఈ ప్రాంతానికి తీరని లోటు అని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.

Next Story

Most Viewed