Murder : పబ్లిక్‌గా మద్యం తాగొద్దన్నందుకు కానిస్టేబుల్ హత్య.. దేశ రాజధానిలో దారుణ ఘటన

by Sathputhe Rajesh |
Murder : పబ్లిక్‌గా మద్యం తాగొద్దన్నందుకు కానిస్టేబుల్ హత్య.. దేశ రాజధానిలో దారుణ ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో : పబ్లిక్‌గా మద్యం తాగొద్దని మందలించిన కానిస్టేబుల్‌ను హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 29న సందీప్ మాలిక్(30) నైట్ డ్యూటీ చేస్తున్నాడు. సివిల్ డ్రెస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. నగ్లోయ్ ఏరియా వద్ద ఆగి ఉన్న కారులో ధర్మేందర్(39), రజ్‌నీశ్(25) మద్యం సేవిస్తున్నారు. అది గమనించిన కానిస్టేబుల్ పబ్లిక్‌గా తాగొద్దని వారిని మందలించాడు. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితులు కోపోద్రిక్తులై కానిస్టేబుల్, అతని బైక్‌ని తమ కారుతో ఢీకొట్టారు. అలాగే 10 మీటర్ల వరకు లాక్కేళ్లారు. దీంతో కానిస్టేబుల్ సందీప్ మాలిక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కానిస్టేబుల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కానిస్టేబుల్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాత్రి 2.15 గంటలకు ఘటన జరగగా.. సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ధర్మేందర్ కు ఆశ్రయం ఇచ్చిన జితెందర్, మనోజ్ లను సైతం అరెస్ట్ చేశారు. నిందితులపై 221, 132, 103, 249 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story