టర్కీలో ఘోర అగ్రిప్రమాదం.. 66 మంది మృతి

by John Kora |   ( Updated:2025-01-21 14:37:41.0  )
టర్కీలో ఘోర అగ్రిప్రమాదం.. 66 మంది మృతి
X

- స్కీ రిసార్టులో చెలరేగిన మంటలు

- తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయిన అతిథులు

దిశ, నేషనల్ బ్యూరో:

టర్కీలోని బోలు ప్రావిన్స్‌లోని ఒక స్కీ రిసార్టులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 66 మంది మృతి చెందగా, మరో 51 మంది గాయపడ్డారు. కర్తాల్‌కాయ స్కీ రిసార్టులోని ది గ్రాండ్ కర్తాల్ హోటల్‌లో మంగళవారం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో భారీ మంటలు చెలరేగాయి. 11 అంతస్తుల ఈ హోటల్‌లోని నాలుగో ఫ్లోర్‌లో ఉన్న రెస్టారెంట్‌లో మొదటిగా మంటలు చెలరేగి.. ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు కూడా వ్యాపించినట్లు బోలు గవర్నర్ అబ్దులజీజ్ ఐదీన్ చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో 234 మంది అతిథులు హోటల్ గదుల్లో ఉన్నట్లు తెలిపారు. అయితే మంటలు చెలరేగి, దట్టమైన పొగలు అలుముకున్నా.. ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ వైఫల్యం చెందడంతో మంటలు మరింతగా వ్యాపించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హోటల్ గదుల్లోని దుప్పట్లను తాడులాగా కట్టుకొని చాలా మంది అతిథులు పై ఫ్లోర్ల నుంచి కిందకు దిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కాగా, చాలా మంది భయాందోళనతో బిల్డింగ్ పై నుంచి దూకడంతోనే మరణించినట్లు సమాచారం. హోటల్‌లో ఉన్న స్కీ ఇన్‌స్ట్రక్టర్ నెజ్మీ మంటల నుంచి తప్పించుకోవడమే కాకుండా.. మరో 20 మందిని రక్షించాడు. కాగా, ఈ దుర్ఘటనపై బోలు ప్రావిన్స్ గవర్నర్ అబ్దులజీజ్ విచారణకు ఆదేశించారు.

Next Story

Most Viewed