అర్ధరాత్రి నది ఉగ్రరూపం.. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు (వీడియో)

by GSrikanth |
అర్ధరాత్రి నది ఉగ్రరూపం.. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం సిక్కింను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. లాచెన్ లోయలో మంగళవారం రాత్రి అకస్మాత్తుగా పోటెత్తిన వరదల ధాటికి 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. ఉత్తర సిక్కింలోని లోనక్ లేక్ ప్రాంతంలో కుండపోత వర్షానికి తీస్తా నది ఉగ్రరూపం దాల్చింది. అదే సమయంలో చుంగ్ థాంగ్ డ్యామ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో దిగువ ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదల ధాటికి సింగ్తమ్ బ్రిడ్జ్ కూలిపోయింది. వరదల తీవ్రతకు లాచెన్‌ లోయలోని ఆర్మీ పోస్టులు నీట మునిగాయి. సింగ్తమ్‌ ప్రాంతంలో ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి.

అందులోని 23 మంది సిబ్బంది గల్లంతైనట్లు ఈస్ట్రన్‌ కమాండ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. కనిపించకుండా పోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. పశ్చిమబెంగాల్, సిక్కింను కలిపే 10వ నెంబర్ జాతీయ రహదారి పలు చోట్ల కొట్టుకుపోయింది. కళ్లముందే కాలికింద ఉన్న రోడ్డు వరదల్లో కోట్టుకుపోతుంటే అక్కడి జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో పలువురు షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story