గ్రహశకలాన్ని కనుకొన్న స్కూల్ విద్యార్థి

by Ajay kumar |
గ్రహశకలాన్ని కనుకొన్న స్కూల్ విద్యార్థి
X

- పేరు పెట్టాలని కోరిన నాసా

- నోయిడా స్టూడెంట్‌కు అరుదైన గౌరవం

దిశ, నేషనల్ బ్యూరో:

అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఒక కొత్త గ్రహశకలాన్ని కనుగొన్న నోయిడా విద్యార్థికి నాసా అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. విద్యార్థి కనుగొన్న ఆస్టరాయిడ్‌కు అతనే పేరు శాశ్వతమైన పెట్టాలని నాసా కోరింది. నోయిడాలోని శివ్ నాడార్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న దక్ష్ మాలిక్‌.. నాసా ప్రాజెక్టులో భాగంగా ఈ ఆస్టరాయిడ్‌ను ఏడాది క్రితం కనుగొన్నాడు. తాజాగా నాసా ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం దీనికి '2023 ఓజీ40'గా పిలుస్తున్నారు. త్వరలోనే దక్ష్ దీనికి శాశ్వతమైన పేరు నిర్ధారించనున్నాడు. దక్ష్ మాలిక్ తన స్కూల్‌కు చెందిన మరో ఇద్దరితో కలిసి ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్ (ఐఏడీపీ)లో భాగంగా హార్డిన్ సిమ్మన్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ప్యాట్రిక్ మిల్లర్ మార్గదర్శకత్వంలో గ్రహశకలాలను కనుగొనే ప్రయత్నం చేశారు.

తమ స్కూల్లోని ఆస్ట్రానమీ క్లబ్‌కు వచ్చిన ఒక మెయిల్ చూసి.. వాళ్లు ఆస్టరాయిడ్‌ను కనుగొనే ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు. విద్యార్థులు, సామాన్య ప్రజలను సిటిజన్ సైన్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇలాంటి ప్రాజెక్టులను నాసా నిర్వహిస్తుంది. కాగా, ఈ సారి 80 దేశాలకు చెందిన 6500 మంది విద్యార్థులు పాల్గొనగా.. చాలా తక్కువ మంది గ్రహ శకలాలు కనుగొన్నారు. వారిలో దక్ష్ ఒకరు. ఇండియాలో ఇలాంటి ఘనత సాధించిన ఆరో విద్యార్థిగా దక్ష్ గుర్తింపు పొందాడు.

దక్ష్ ఇంత వరకు ఏ పేరు పెట్టాలనే నిర్ణయానికి రాలేదు. 'డిస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్', 'కౌంట్ డౌన్' అనే రెండు పేర్లలో ఏదో ఒకటి పెట్టాలని భావిస్తున్నాడు. అయితే ఈ పేరు దక్ష్ సూచించినా.. వెంటనే అమలు లోకి రాదని తెలుస్తోంది. నాసా మరికొన్ని అబ్జర్వేషన్స్ చేసి, అది ఆస్టరాయిడ్ అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ పేరును శాశ్వతం చేస్తుంది. ఇందుకు నాలుగైదేళ్లు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత పారీస్‌లో ఉన్న ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ కేటలాగ్‌లో రికార్డు చేయబడుతుంది.

Next Story