Education: దేశవ్యాప్తంగా 35 శాతం స్కూళ్లలో 50 కంటే తక్కువ విద్యార్థులు

by S Gopi |
Education: దేశవ్యాప్తంగా 35 శాతం స్కూళ్లలో 50 కంటే తక్కువ విద్యార్థులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపై ఓ నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ సేకరించిన వివరాల ప్రకారం.. దేశంలోని 35 శాతం పాఠశాలల్లో 50 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. వీటిలోనూ ఎక్కువ పాఠశాలల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 10 శాతం స్కూళ్లలో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా చాలా తరగతులను, సబ్జెక్టులను నిర్వహించడంలో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొంతమంది టీచర్లు తమ సబ్జెక్టు కాకపోయినప్పటికీ తరగతులను నిర్వహించాల్సి వస్తోంది. లైబ్రరీలు, ప్రయోగశాలలు వంటి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల చాలావరకు చిన్న పాఠశాలలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో లోపాలు ఏర్పడుతున్నాయి. మరికొంతమంది ఉపాధ్యాయులకు బోధించే సమయంలో ఇతర పనులు అప్పగిస్తుండటంతో వారు తమ వృత్తికి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా ఉంటున్నాయి. 2022-23లో 1-8 తరగతులకు సంబంధించి 16 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా జార్ఖండ్(40 శాతం), బీహార్(32 శాతం), మిజోరం(30 శాతం), త్రిపుర(26 శాతం) ఖాళీలు ఉన్నాయి.

2023లో ఎడ్యుకేషన్ స్టాండింగ్ కమిటీ రాష్ట్రాలు టీచర్స్ రిక్రూట్‌మెంట్‌ను వేగవంతం చేయాలని సూచించింది. అలాగే, నియామకాల్లో పారదర్శకత కోసం అటానమస్ టీచర్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనను సూచించింది. 2023-24లో ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ స్థాయి వరకు 12 శాతం మంది ఉపాధ్యాయులు సరైన అర్హత పొందలేదని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రీ ప్రైమరీ టీచర్లలో 48 శాతం మంది అర్హత సాధించలేదని వెల్లడించింది. ఈ సందర్భంగా 74 శాతం అక్షరాస్యత ఉన్న దేశంలో అత్యధిక జనాభాకు ఏటా ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉంది. ఈ క్రమంలో దేశంలో పేదరిక నిర్మూలనకు విద్య కీలకం. అలాగే పాఠశాలల్లో అవసరమైన స్థాయిలో ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని కొనసాగించడం ద్వారా నాణ్యమైన విద్యను, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తును అందించవచ్చని నివేదిక పేర్కొంది.



Next Story

Most Viewed