‘మీకు మనసెలా వచ్చింది జగన్’

by Anukaran |   ( Updated:2020-09-06 05:35:09.0  )
‘మీకు మనసెలా వచ్చింది జగన్’
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతోంది వైసీపీ సర్కార్. తడి గుడ్డతో రైతుల గొంతు కొయ్యాలని చూస్తోంది. తండ్రి ఆశయాలకు కొడుకు వైఎస్ జగన్ తూట్లు పొడుస్తున్నారని స్వయంగా ఆయన సొంత మీడియా సాక్షే అంటుంది. అప్పట్లో కిరణ్ సర్కార్ మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడుతోంది’ అని ఆరోపించారు.

ఈ మీటర్లు రైతుల పాలిట యమపాశాలు కాబోతున్నాయి అంటూ చక్కగా వివరించింది జగన్ మీడియా అని చెప్పారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ నెలలు గడుస్తున్నా సొమ్ము బ్యాంకులో జమకావడం లేదు, ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ అమలు చేస్తే ఇదే తరహాలో సబ్సిడీ కోసం రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి తలెత్తనుందని మీరే చెప్పారంటూ.. లోకేశ్ ఓ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

నగదు బదిలీ పేరుతో భారాన్ని రైతుపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు. దశల వారీగా సబ్సిడీ తగ్గించి పథకాన్ని నిర్వీర్యం చేస్తారని లోకేశ్ విమర్శలు చేశారు. మీటర్ల వలన రైతులకు జరిగే నష్టం గురించి మీరే చెప్పి.. ఇప్పుడు రైతులను మోసం చేస్తూ వారిని నట్టేట ముంచడానికి మీకు మనసెలా వచ్చింది జగన్ రెడ్డి అంటూ లోకేశ్ సూటిగా ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed