యూఎస్ ఓపెన్ టైటిల్ విన్నర్ నయోమీ ఒసాకా

by  |
యూఎస్ ఓపెన్ టైటిల్ విన్నర్ నయోమీ ఒసాకా
X

దిశ, స్పోర్ట్స్ : అప్పటికే తొలి సెట్ ఓడింది.. రెండో సెట్‌లో ప్రత్యర్థి అజరెంకా 2-0 తేడాతో ముందంజలో ఉంది. టీవీ సెట్ల ముందు చూస్తున్న ప్రేక్షకులకు ఒసాకా ఇక కోలుకోవడం కష్టమేనని భావించారు. అజరెంకా యూఎస్ ఓపెన్ గెలుస్తుందని అంచనా వేశారు. కానీ జపాన్ నాలుగో సీడ్ క్రీడాకారిణి నయోమి అద్భుతమే చేసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన యూఎస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను నయోమీ ఒసాకా గెలిచింది.

గంటా 53 నిమిషాల పాటు జరిగిన ఫైనల్స్‌లో అజరెంకాను 1-6, 6-3, 6-3 తేడాతో ఓడించి తన కెరీర్‌లో రెండో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సాధించింది. తొలి సెట్‌లో తడబడినా.. మిగతా రెండు సెట్లను అలవోకగా గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఒసాకా మొత్తం 6 ఏస్‌లు సంధించగా 8 బ్రేక్ పాయింట్లు సాధించింది. కాగా, ఫైనల్స్‌లో అజరెంకా ఓడిన తీరు గమనిస్తే అందరికీ ఆమె సెరేనాపై గెలిచిన సెమీఫైనల్స్ గుర్తుకు వచ్చింది. ఆ మ్యాచ్‌లో అజరెంకా తొలి సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయి తర్వాత వరుసగా 6-3, 6-3తో గెలిచి ఫైనల్స్ చేరుకుంది. ఇప్పుడు ఒసాకా చేతిలో అదే విధంగా ఓడిపోవడం గమనార్హం.

1994 తర్వాత ఫస్ట్ సెట్ ఓడిపోయి విజేతగా నిలిచిన టెన్నిస్ ప్లేయర్‌గా ఒసాకా రికార్డు సృష్టించింది. 2018లో తొలిసారి యూఎస్ ఓపెన్ గెలుచుకున్న ఓసాకా, ఆ తర్వాత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. అయితే గత ఏడాది యూఎస్ ఓపెన్ నాలుగో రౌండ్‌లోనే వెనుదిరిగిన ఒసాకా.. ఈ సారి ఛాంపియన్‌గా అవతరించింది. ఒసాకా కెరీర్ మొత్తంలో మూడు గ్రాండ్‌స్లామ్స్ సాధించింది. మరోవైపు మహిళల డబుల్స్‌ విభాగంలో అన్‌సీడెడ్‌ జోడీ లౌరా సిగెముండ్‌ (జర్మనీ)-వెరా జ్వొనరేవా (రష్యా) విజేతగా నిలిచింది. 80 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ఈ జంట 6-4, 6-4తో మూడో సీడ్‌ నికోల్‌ మెలికార్‌ (అమెరికా)-యిఫాన్‌ షు (చైనా) జోడీపై విజయం సాధించింది.


Next Story

Most Viewed