వివిధ వైరస్‌లు… వాటి పేరు వెనక కథలు

by  |
వివిధ వైరస్‌లు… వాటి పేరు వెనక కథలు
X

దిశ, వెబ్‌డెస్క్:
ఇప్పటి వరకు ఎన్నో వైరస్‌లు వచ్చాయి వెళ్లాయి.. కానీ మానవాళి దేనికీ తలొగ్గలేదు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కుంది. వాటిలోనే ఈ కరోనా కూడా కలిసిపోతుంది. అయితే ఈ వైరస్‌లను గుర్తించడం ఒక ఎత్తు అయితే, వాటికి పేర్లు పెట్టి వాడుకలోకి తీసుకురావడం మరో ఎత్తు. ఈ వైరస్‌లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్లు పెడుతుందని తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ వైరస్‌లు, వాటి పేర్ల వెనక కథలు ఒకసారి గుర్తు చేసుకుందాం.

1. సార్స్ కోవ్ 2

ముందు దీన్ని 2019 నోవెల్ కరోనా వైరస్ అని పిలిచారు. కొవిడ్ 19కి కారణమైన వైరస్ ఇదే. తర్వాత 2003లో సార్స్‌కి కారణమైన వైరస్ మూలాలు ఉండటంతో ఐసీటీవీ వారు దీనికి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2 అని పేరు పెట్టారు.

2. మెర్స్-కోవ్

2012లో సౌదీ అరేబియాలో దీన్ని గుర్తించారు. అందుకే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రో కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఇది కూడా శ్వాస సంబంధిత వైరల్ వ్యాధులను కలిగించే వైరస్ జాతికి చెందినదే. పెద్ద మూపురం గల ఒంటెల నుంచి ఈ వైరస్ ప్రబలిందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

3. ఎబోలా వైరస్

ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం 1976లో ఒకేసారి రెండు చోట్ల ఈ ఎబోలా వైరస్ ప్రబలింది. వాటిలో ఒకటైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా నది ఉంది. ఆ నది పేరు మీద దీనికి ఎబోలా అని పేరు పెట్టారు. టెరెపోడిడే కుటుంబానికి చెందిన ఫ్రూట్ గబ్బిలాలలో ఈ వైరస్ పుట్టిందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

4. నిఫా వైరస్

సీడీసీ ప్రకారం, మలేషియాలోని సుంగై నిఫా గ్రామంలో ఈ వైరస్ పుట్టింది. ఆ ఊరిలోని పందుల పెంపకందారులకు 1999లో ఈ వైరస్ ద్వారా మెదడువాపు వ్యాధి సోకింది. తర్వాత మే 2018లో పందులు, గబ్బిలాల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకింది.

5. హెచ్1ఎన్1

ఇది ఒక రకమైన ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌కి చెందినది. హెమ్మగ్లుటినిన్ (హెచ్), న్యూరామినిడేస్ (ఎన్) అనే రెండు ప్రోటీన్ల ఆధారంగా ఈ రకం వైరస్‌లు నిర్మితమవుతాయి. ఈ వైరస్ పందుల నుంచి మనుషులకు వ్యాపించడంతో దీని వల్ల వచ్చిన వ్యాధిని స్వైన్ ఫ్లూ అని పిలిచారు.

6. బర్డ్ ఫ్లూ

ఇది కూడా ఇన్‌ఫ్లూయెంజా రకానికి చెందినదే. కాకపోతే హెచ్5ఎన్1గా పరిగణిస్తారు. పక్షుల నుంచి మనుషులకు సోకింది కాబట్టి బర్డ్ ఫ్లూ పేరు పెట్టారు. ప్రత్యక్ష తాకిడి వల్లనే ఈ వ్యాధి కూడా ప్రబలింది కానీ కరోనా మాదిరిగా ఎక్కువగా ప్రబలలేదు.

వీటన్నింటికి ముందుగా వాటి జన్యుక్రమాన్ని అనుసరించి ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ వారు పేరు ప్రతిపాదిస్తారు. అదే పేరును తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదిస్తుంది.

Tags: covid, corona, Bird flu, H1N1, H5N1, swine flu, WHO, ICTV



Next Story