దమ్ముంటే రాజీనామా చేసి అడగండి

by srinivas |
దమ్ముంటే రాజీనామా చేసి అడగండి
X

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ రాజధానిగా వద్దని చెబుతున్న విశాఖలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి వైజాగ్ రాజధానిగా వద్దని కోరుతూ ఎన్నికలకు రావాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. అమరావతి ఏకైక రాజధాని కావాలని కోరుతున్న ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు అమరావతి కావాలో, విశాఖ కావాలో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన సూచించారు. అమరావతి రైతులపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో పథకాలు చేపడుతుంటే టీడీపీ నేతలు భరించలేకపోతున్నారని మండిపడ్డారు.

టీడీపీ నేతలతో పాటు బీజేపీలో చేరిన టీడీపీ నాయకులు సీఎం జగన్‌పై అభాండాలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏ ఒక్క ప్రాంతం కోసమో, వర్గం కోసమో పనిచేయడం లేదని, 13 జిల్లాల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారని ఆయన చెప్పారు. రాజధానికి అవసరమైన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని, వైజాగ్ రాజధాని అయి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. 200 కోట్ల రూపాయలతో 1,088 అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తే అందులో 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్‌కు ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులను పరామర్శించడానికి మాత్రం తీరిక లేదా? అని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed