ఎంపీపీ కుటుంబంపై హత్యాయత్నం..!

దిశ ప్రతినిధి, నల్లగొండ:

నల్లగొండ జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. జిల్లాలోని చిట్యాల ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ కుటుంబంపై హత్యాయత్నం చేశారు. మంగళవారం అర్ధరాత్రి నాలుగు కార్లలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులను గ్రామస్తులు వెంబడించగా.. 15 మంది నేరస్తుల్లో తొమ్మిది మంది పట్టుబడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. పేరేపల్లి గ్రామానికి చెందిన కొలను వెంకటేశ్‌, అంతటి వెంకటేశ్‌ గత సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో అంతటి వెంకటేశ్‌ చేతిలో కొలను వెంకటేశ్‌ ఓడిపోయాడు. అనంతరం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కొలను వెంకటేశ్‌ భార్య సునీత పోటీ చేసి చిట్యాల ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇది జీర్ణించుకోలేని అంతటి వెంకటేశ్‌.. కొలను వెంకటేశ్‌పై కక్ష పెంచుకున్నాడు. కాగా, మంగళవారం ఎంపీపీ సునీత భర్త వెంకటేశ్‌ పుట్టినరోజు పురస్కరించుకొని వేడుక నిర్వహించేందుకు కుటుంబసభ్యులతో కలిసి పేరేపల్లికి వచ్చారు. ఈ క్రమంలో అంతటి వెంకటేశ్‌ అనుచరుడు జగన్‌ వారిని హత్య చేయించేందుకు హైదరాబాద్‌ నుంచి 15 మంది కిరాయి రౌడీలను నాలుగు కార్లలో రప్పించాడు. అయితే రౌడీలు ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కుటుంబసభ్యులు గట్టిగా కేకలు వేయడంతో పారిపోయేందుకు యత్నించారు. స్థానికుల సహయంతో తొమ్మిది మందిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement