చేనేతలంటే.. సిరిసిల్ల.. సిద్ధిపేట.. గజ్వేలేనా?

by  |
చేనేతలంటే.. సిరిసిల్ల.. సిద్ధిపేట.. గజ్వేలేనా?
X

దిశప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, రాచరిక పాలన సాగుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు చేనేతలంటే.. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే గుర్తుకొస్తాయని, ఇతర జిల్లాల్లోని చేనేతలు గుర్తుకు రావడం లేదన్నారు. ఈ విషయంలో జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి సిగ్గుపడాలని, కనీసం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లోని చేనేతల గురించి కనీసం మాట్లాడలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 చేనేత కేంద్రాల్లోని చేనేత కార్మికులు తమ జీవన్మరణ సమస్యల సాధన కోసం గత 45 రోజులుగా రిలే నిరాహారదీక్షలు , నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చేనేత కార్మికులు ఇబ్బందులు తెలుసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొయ్యలగూడెం, చౌటుప్పల్, నారాయణ్ పూర్, పుట్టపాక, నల్లగొండ జిల్లాలోని మునుగోడు, చండూరు, ఘట్టుప్పల్ ప్రాంతాల్లో చేనేత సహకార సంఘాలను సందర్శించి సంఘీభావం తెలిపారు.

మునుగోడు నియోజక వర్గంలోని 3500 నిరుపేద చేనేత కుటుంబాలకు “కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్” సహకారంతో 60 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇచ్చినట్లు గా చేనేత కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ ఉన్న కాలంలో చేనేతను ఆదుకోడానికి రూ.25 వేలు మంజూరు చేశారని, ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా సొసైటీలో పేరుకుపోయిన మెటీరియల్‌ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న చేనేత కుటుంబాలతో మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలపై చర్చించి సాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. నిరాహారదీక్షలు చేస్తున్న నేత కార్మికులు ఎదురుకొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేత కార్మికులు కరోనా కాలంలో పడుతున్న ఇబ్బందులను బాధలను రాజగోపాల్ రెడ్డికి విన్నవించారు. నేతన్నల బాధలు విన్న ఆయన మగ్గాలు నేసే చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, 5 నెలలుగా కోట్ల రూపాయల మెటీరియల్ రెడీగా ఉన్నప్పటికీ.. కొనుగోలు చేసే నాథుడే లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత కచ్చితంగా ప్రభుత్వంపై ఉందన్నారు.


Next Story

Most Viewed