జలదీక్ష భగ్నం..ఎమ్మెల్యే సీతక్క‌ హౌస్ అరెస్ట్

by Shyam |
జలదీక్ష భగ్నం..ఎమ్మెల్యే సీతక్క‌ హౌస్ అరెస్ట్
X

దిశ, వరంగల్ :
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏటూరు నాగారం దేవాదుల వద్ద ములుగు ఎమ్మెల్యే సీతక్క తలపెట్టిన జలదీక్షను పోలీసులు అడ్డుకుని శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆమెను గృహ నిర్భంధంలో ఉంచారు.ఈ చర్యపై సీతక్క స్పందిస్తూ..ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు తీసుకుపోయి ములుగు ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. గోదావరిని ఆనుకుని ఉన్న మండలాలకు నీరివ్వకుండా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఇతర ప్రాంతాలకు, అదే విధంగా రామప్పలో లిఫ్ట్ ఏర్పాటు చేసి నర్సంపేట, జనగాం ప్రాంతాలకు తీసుకుపోతున్నారే తప్పా తమ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యల వల్లే టీపీసీసీ ఆదేశాల మేరకు జల దీక్ష చేపట్టామన్నారు. శాంతియుతంగా చేస్తున్న దీక్షను అడ్డుకోవడం ముఖ్యమంత్రికి తగదని, అక్రమ అరెస్టులతో తమ నిరసనను అడ్డుకోలేరని సీతక్క విమర్శించారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన ప్రాంతాలపై వివక్షత చూపుతున్నారన్నారు. ఆయన ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రి కాదని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. గోదావరిని ఆనుకుని ఉన్న ఏటూరునాగారం, మంగపేట వద్ద చెక్ డ్యాంలు నిర్మించాలని, అదే విధంగా గోవిందరావు పేట లక్నవరం చెరువు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అదే విధంగా కొత్తగూడ మండలం పాకాల చెరువు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి, ఇక్కడి ప్రాంతాలకు నీళ్లిచ్చిన తర్వాతే పక్క ప్రాంతాలకు నీరివ్వాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story