ఆ సత్తా ఏఐకు ఉంది -ముఖేశ్ అంబానీ

by Harish |
ఆ సత్తా ఏఐకు ఉంది -ముఖేశ్ అంబానీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత టెక్నాలజీ రంగాన్ని మార్చడంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ముఖ్యమైన పాత్ర వహిస్తుందని ముఖేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. అయితే, ఏఐ టెక్నాలజీ ఎప్పటికీ మానవ మేధస్సును భర్తీ చేయదని స్పష్టం చేశారు. ‘బదులుగా 4వ పారిశ్రామిక విప్లవాన్ని ఏఐ తీసుకురాగలదని’ సూచించారు.

ఏఐతో పాటు ఇతర అనుబంధ సాంకేతికత భారత్ సహా ప్రపంచం ముందు అత్యంత క్లిష్టమిన, ఒత్తిడి కలిగించే సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని అందిస్తాయని ముఖేశ్ పేర్కొన్నారు. ప్రధానంగా భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏఐ ఎంతో సహకరిస్తుందని తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రధానంగా గ్లోబల్ వర్చువల్ సదస్సు సోమవారం ప్రారంభమైంది. రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫర్ సోషల్ ఎంపవర్‌మెంట్(రైజ్)-2020గా పిలవబడే ఈ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఐదురోజుల పాటు జరగనున్న ఈ సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, టెక్నాలజీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది.

ఈ సమావేశంలో మాట్లాడిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ..ఇంటిలిజెంట్ డేటా డిజిటల్ పెట్టుబడికి మూలమని ముఖేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ రంగంలో భారత్ తన లీడర్‌షిప్‌ని కొనసాగిస్తోందన్నారు. ఆరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా మిషన్‌ను ప్రారంభమైందని, అత్యంత ప్రాధాన్యతగా దీన్ని కొనసాగించారని, అనంతరం దాని ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని ముఖేశ్ అంబానీ తెలిపారు.

ఈ క్రమంలోనే భారత్ ప్రపంచంలోనే మొబైల్ వినియోగంలో 155వ స్థానం నుంచి అగ్ర స్థానానికి చేరుకుందన్నారు. అలాగే, 99 శాతం మందికి భారత్ 4జీ బ్రాడ్‌బాండును అందించిందని తెలిపారు. భారత్‌నెట్ ద్వారా దేశంలోని ప్రతి ఇల్లు, కార్యాలయాన్ని చేరుకునేందుకు ప్రాధాన్యత లభించిందన్నారు. నగరాలు, పట్టణాలతో పాటు సుమారు 6 లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను భారత్ కొత్తగా రూపొందిస్తోందన్నారు.

ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, దీనివల్ల దేశంలోనే సొంత ఉత్పత్తులను తయారు చేసుకునేందుకు దోహదపడుతోందని ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ప్రపంచస్థాయి డేటా సెంటర్లతో కంప్యూటర్ పవర్‌గా భారత్ ఎదుగుతోందన్నారు. భవిష్యత్తులో దేశంలోని 130 కోట్ల మంది కూడా అక్షరాస్యత సాధిస్తె ఇది అత్యంత వేగంగా వృద్ధి జరగడంతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలు సృష్టించవచ్చన్నారు.

దేశంలో అందరికీ ఉన్నత అవకాశాలను కల్పించే అవకాశాలు మెరుగవుతాయని ముఖేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. దేశీయంగానే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని అభివృద్ధి చేయడం ద్వారా రానున్న రోజుల్లో భారతీయులందరికీ సులభ రీతిన, సౌకర్యవంతమైన టెక్నాలజీని అందుబాటులోకి వస్తుందని ముఖేశ్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed