ఎంఎస్ఎంఈలకు రూ.512 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్

by  |
ఎంఎస్ఎంఈలకు రూ.512 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. వాటిని ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించిన ప్రభుత్వం రెండో విడత రాయితీ బకాయిలను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బటన్ నొక్కి రూ.512 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. రీస్టార్ట్‌ కార్యక్రమంలో భాగంగా 7,717 పరిశ్రమలకు అందాల్సిన రూ.17,045 బకాయిల్లో తొలి విడతగా మే నెలలోనే రూ.450 కోట్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఎంఎస్ఎంఈలకు టీడీపీ హయాంలో (2014-15 నుంచి) ఇవ్వాల్సిన రూ.827.5 కోట్ల బకాయిలతో పాటు వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీతో కలిపి మొత్తం రూ.962.62 కోట్లకు చేరుకుంది. దీంతో తొలి విడతగా రూ.450.27 కోట్లను, మలివిడతగా రూ.512 కోట్లను జగన్ ప్రభుత్వం విడుదల చేసింది.

రూ.180కోట్ల ఫిక్స్‌డ్ విద్యుత్ చార్జీలు మాఫీ:

బకాయిలు విడుదల చేసిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. చిన్న పరిశ్రమలకు తోడుంటేనే వారి కాళ్ల మీద వాళ్లు నిలబడడంతోపాటు మరికొంత మందికి ఉపాధి కాల్పిస్తారని అన్నారు. వ్యవసాయ రంగం తరువాత అత్యధికులకు ఉపాధి కల్పించే రంగం ఎంఎస్ఎంఈలదేనని తెలిపారు. కరోనా కారణంగా పరిశ్రమలు నడపలేని పరిస్థితుల్లో ఉన్న చిన్న పరిశ్రమలకు వెసులుబాటు ఇచ్చేందుకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కరెంటు ఫిక్స్‌డ్ ఛార్జీలు రూ.180 కోట్లను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీఎస్ఎఫ్‌డీసీ ద్వారా రూ.200 కోట్లతో పెట్టుబడులను తక్కువ రుణాలకే అందిస్తున్నామని వెల్లడించారు. ఈ రుణాలకు ఆరు నెలల మారటోరియంతో పాటు మూడేళ్ల కాలపరిమితి కూడా ఇస్తున్నామని తెలిపారు. అదే సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులను 25శాతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. స్పిన్నింగ్ మిల్లులకు సంబంధించిన రూ.1000 కోట్ల బకాయిలను వచ్చే ఏడాది చెల్లిస్తామని జగన్ హామీనిచ్చారు.

‘ఎంఎస్ఎంఈల ద్వారా 10లక్షల మందికి ఉపాధి’

పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, విడుదల చేసిన మొత్తంతో 2,435 ఎంఎస్‌ఎంఈ యూనిట్స్‌కు సంబంధించిన 4900 క్లెయిమ్స్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరనుందన్నారు. అలాగే, 128 పుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లకు 163 క్లెయిమ్స్‌కు సంబంధించిన రూ.58.97 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసినట్టు తెలిపారు. ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో సుమారు 10లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. రెండో విడత సాయం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని యూనిట్లకూ ప్రత్యేక కేటగిరీ కింద సాయం అందుతుందని చెప్పారు. నష్టపోయిన పరిశ్రమలను ఆదుకోవడంతో పాటు, ఎలాంటి ఆటంకాలు లేకుండా కంపెనీల ఆపరేషన్స్‌ ప్రారంభమయ్యేలా చూడటమే ఈ ఆర్ధిక సాయం వెనుక ఉద్దేశ్యమని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, ఎంఎస్ఎంఈలు తయారు చేసే 25శాతం ప్రొడక్ట్స్‌ని ప్రభుత్వమే కొనుగోలు చేసి అన్ని ప్రభుత్వ శాఖలు, స్ధానిక సంస్ధలు, రాజ్యాంగ సంస్ధలు, డెవలెప్మెంట్‌ అథారిటీలు, కంపెనీలు, కార్పొరేషన్‌లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్, సొసైటీలు, ట్రస్టులు, ఇతర ప్రభుత్వరంగ సంస్ధల ద్వారా మార్కెటింగ్‌ కల్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఎంఎస్‌ఎంఈలు, లార్జ్‌ అండ్‌ మెగా ఇండస్ట్రీస్‌ కూడా ఆన్‌ లైన్లో ఫిక్స్‌డు, డిమాండ్‌ ఛార్జీల రద్దుతో పాటు ఎంఎస్‌ఎంఈలు వర్కింగ్‌ కేపిటల్‌ లోన్స్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం http://www.apindustries.gov.in/restart-package వెబ్‌‌సైట్‌‌ను సంప్రదించాలని సూచించారు.


Next Story

Most Viewed