కుల్దీప్ హ్యాట్రిక్ వెనుక ధోనీ

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వన్డే క్రికెట్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఒక ఏడాది కూడా గడవక ముందే ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం. తన తొలి హ్యాట్రిక్ వెనక మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సహాయం కూడా ఉందని చెబుతున్నాడు. 2017లో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ జట్టు కోల్‌కతా ఈడెన్ గార్డెన్‌లో ఒక వన్డే ఆడింది. ఆ సమయంలో భారత జట్టు కేవలం 253 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఆసీస్ ముందు ఉంచింది.

కాగా, ఒక ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తున్న కుల్దీప్ మొదట్లో ఇబ్బంది పడ్డాడు. తనను వేరే ఎండ్‌ నుంచి బౌలింగ్ చేయడానికి అనుమతించమని కెప్టెన్ విరాట్ కొహ్లీని కోరాడు. చాహల్ స్పెల్ ముగిసిన తర్వాత బౌలింగ్ ఇస్తాను.. అప్పుడు ఆ ఎండ్ నుంచి బౌలింగ్ చేయి అని కొహ్లీ చెప్పాడు. అంతే కాకుండా అప్పటి వరకు హాఫ్ హ్యాండ్ టీషర్ట్‌లో బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడిన కుల్దీప్.. మధ్యలో డ్రెస్సింగ్ రూంకి వెళ్లి ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకొని వచ్చాడు. చాహల్ బౌలింగ్ పూర్తయ్యాక వేరే ఎండ్ నుంచి కుల్దీప్ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు.

ముందుగా మాథ్యూ వేడ్ వికెట్ ఆ తర్వాత ఆస్టన్ అగర్ వికెట్ తీశాడు. దీంతో మూడో బంతిని వేయడానికి ముందు కీపర్ ధోనీ వద్దకు వెళ్లి ఏ బాల్ వేయాలి అని అడిగాడట. ‘నీకు మనసుకు నచ్చిన బంతి వేయి. కానీ తప్పకుండా వికెట్ల మీదకే వెయ్యి’ అని ధోనీ సలహా ఇచ్చాడు. గల్లీ, స్లిప్‌లలో ఇద్దరు ఫీల్డర్లను పెట్టి ధోనీ చెప్పినట్లే వికెట్ల మీదకు వేశాను. బంతి బ్యాట్ ఎడ్జ్‌కి తగిలి కీపర్ చేతిలో పడింది. ఆ క్షణాన్ని తాను ఎప్పుడూ మర్చిపోలేనని కుల్దీప్ అన్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌పై కూడా కుల్దీప్ హ్యాట్రిక్ నమోదు చేశాడు.

Advertisement