మమ్మల్ని అవినీతిపరులంటారా..?

దిశ ప్రతినిధి, నల్లగొండ : తాతలు, ముత్తాతలు, తండ్రుల కాలం నాటి నుంచి పేరుకుపోయిన రెవెన్యూ రికార్డులను నెలరోజుల వ్యవధిలోనే ప్రక్షాళన చేసినందుకు ప్రభుత్వం మాకిచ్చే గౌరవం ఇదేనా అంటూ VROలు, VRAలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రెవెన్యూ శాఖలో భారీగా అవినీతి చోటు చేసుకుంటున్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తిగానే ఉంది. భూములకు సంబంధించిన వ్యవహారంలో రెవెన్యూ శాఖలో కీలకంగా వ్యవహరించే వీఆర్వో, వీఆర్ఏలు రైతులను పీల్చిపిప్పి చేస్తున్నారు. దీనితో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా సంస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే కొత్త రెవెన్యూ చటాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలోనే కింది స్థాయిలో కీలకమైన వీఆర్వో వ్యవస్థను రద్దుచేసే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఒకవేళ కొనసాగించినా, వారి విధుల్లో భారీగా కత్తెర పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తే వారి విధులను పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖలకు బదలాయించేలా ప్రాథమికంగా ప్రతిపాదనలు తయారు చేసింది. రెవెన్యూ, గ్రామ రికార్డుల నిర్వహణ బాధ్యతలను వ్యవసాయ విస్తరణాధికారులకు.. రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్ల పంపిణీ తదితరాలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించాలని యోచిస్తోంది. తహసీల్దార్ల అధికారాల్లో కోత ఆలోచనకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో వీఆర్వోల అధికారాలనూ కుదించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇదీ పరిస్థితి..

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. ఇందులో నల్లగొండ జిల్లా విషయానికి వస్తే.. 31 మండలాల పరిధిలో 320 మంది విఆర్వోలు, 821 మంది వీఆర్ఏలు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో నల్లగొండ జిల్లాలోని వీఆర్వోలు, వీఆర్ఏలు ఆయా మండలాల తహసీల్దార్లకు తమ పరిధిలోని రికార్డులను అప్పగించారు. దీంతో పాటు తమ దగ్గర రెవెన్యూ శాఖకు సంబంధించిన ఎటువంటి రికార్డులు లేవంటూ ప్రమాణ పత్రాలను దాఖలు చేశారు.

యాదాద్రి జిల్లాలో..

యాదాద్రి భువనగిరి జిల్లాలో 132 మంది వీఆర్వోలు ఆయా మండలాల పరిధిలోని తాసిల్దార్లకు రెవెన్యూ రికార్డులను అప్పగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్, రాజాపెట్, ఆలేరు, మండలాల్లోని గ్రామాల వీఆర్వోల నుంచి తహసీల్దార్లు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. యాదగిరిగుట్ట మండలంలో 16 గ్రామాలు, తుర్కపల్లిలో 22 గ్రామాలు, బొమ్మల రామారంలో 23 గ్రామాలు, మోటకొండూరులో 11 గ్రామాలు, రాజపేట్‌లో 23 గ్రామాలు, ఆలేరులో 14 గ్రామాలు, మొత్తం 109 గ్రామాల వీఆర్వోల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

సూర్యాపేట జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలో 279 రెవెన్యూ గ్రామాలు ఉండగా, జిల్లా వ్యాప్తంగా 257 మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 219 మంది వీఆర్వోలు ఉండగా, వీరు అందరూ తమ మండల తహసీల్దార్ కార్యాలయంలో భూమికి సంబంధించి రికార్డులను అప్పచెప్పారు. జిల్లాలో 559 మంది వీఆర్ఏలు ఉండగా, ప్రస్తుతం 465 మంది విధులు నిర్వహిస్తున్నారు.

అవినీతికి కేంద్ర బిందువుగా VROలు..

వీఆర్వోల వ్యవస్థను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే వారి నుంచి అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్థాయిలో అవినీతికి వీఆర్వోలు కేంద్ర బిందువుగా ఉన్నారని.. ఏళ్ల తరబడి వాళ్ల చుట్టూ తిరిగినా ఇప్పటికీ పాస్‌బుక్‌లు అందలేదనే విషయం అక్షర సత్యం. వీఆర్వోల ధన దాహం, నిర్లక్ష్యం వల్ల.. తాము రైతు బంధు పథకానికి దూరమయ్యామని చాలామంది రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ మొదటి నుంచి రెవెన్యూ శాఖపై చాలా సీరియస్‌గా ఉన్నారు. దీనంతటికీ కారణం రెవెన్యూ ఉద్యోగుల్లో చాలా మంది అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు. వందల కోట్లు ప్రజల నుంచి లాక్కుంటూ.. అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా ఎన్నో ఉదంతాలు తెరపైకి వస్తున్నాయి. అధికారుల తీరుపై ప్రజలు భగ్గుమంటున్నారు. ఏ పని కైనా మనీ చేతిలో పెట్టందే ఫైల్ కదలట్లేదు, స్టాంప్ పడట్లేదు. ఇలాగైతే తాము ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

ప్రస్తుతం రెవెన్యూ శాఖలో కీలకంగా VROలు..

ప్రస్తుతం రెవెన్యూ శాఖలో వీఆర్వోలు చాలా కీలకంగా మారారు. రెవెన్యూ శాఖ పరిధిలో ఈ చిన్న పని చేయాలన్న వీఆర్వోలు, వీఆర్ఏల సహకారం తప్పనిసరిగా మారింది. దాదాపు 95 రకాల విధులు వారి చేతుల్లో ఉన్నాయి. ప్రజలతో డైరెక్టుగా సంబంధం కలిగి ఉంటే.. గ్రామ రెవెన్యూ అధికారుల్లో చాలా మంది అవినీతికి పాల్పడుతున్నారు. ప్రతి పనికీ రేటు కట్టి లంచాలు మింగుతున్నారు. ప్రజలేమో తమ తలరాత అనుకుంటూ.. లంచాలు ఇస్తూ.. కష్టాలపాలవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థకు మంగళం పాడింది. ఇప్పుడు వారి స్థానంలో సరికొత్త వ్యవస్థ రాబోతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

VROలకు ఎసరు పెట్టిన కాస్తు కాలమ్..

భూరికార్డుల ప్రక్షాళనలో వీఆర్వోల భాగస్వామ్యంతో అక్రమాలు జరిగాయని అంచనాకొచ్చిన ప్రభుత్వం.. భూ రికార్డుల నిర్వహణ నుంచి వారిని పూర్తిగా తప్పించాలని నిర్ణయించింది. భూ రికార్డుల్లో కాస్తు కాలమ్‌ను తొలగించినందున, క్షేత్రస్థాయిలో వీరి అవసరం కూడా లేదనే భావనకొచ్చింది. అయితే, వీఆర్వో వ్యవస్థను పూర్తిస్థాయిలో రద్దుచేస్తే ఉద్యోగ సంఘాల ప్రతికూలత వస్తుందని భావిస్తున్న సర్కార్.. వీరి సేవలను వేరే విధంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. నైపుణ్యం ఉన్నవారిని రెవెన్యూలోనే కొనసాగించి.. ఇతరులను పూలింగ్‌లో పెట్టడం ద్వారా పంచాయతీరాజ్, వ్యవసాయశాఖల్లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థను గనుక రద్దు చేస్తే క్వాలిఫైడ్ వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా నిర్వచిస్తూ ప్రస్తుత శాఖలోనే కొనసాగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

VROలు ఏమంటున్నారంటే..

కొత్త చట్టాన్ని తాము స్వాగతిస్తామని వీఆర్వోలు అంటున్నారు. అయితే కొత్త చట్టంలో వీఆర్వోల పాత్ర ఎలా ఉంటుందో తెలియదనీ, తమ పాత్రపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజల కోసం ఎంతో సేవచేస్తూ.. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళన కోసం తాము చేసిన సేవలు అనిర్వచనీయమైనవన్నారు. నెల రోజుల పాటు రాత్రింబవళ్లు తేడా లేకుండా అహర్నిశలు పని చేశానని గుర్తు చేశారు అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక నెల మాత్రమే ఉందన్నారు. పైగా తమ అవినీతిపరులమని బిరుదు ఇచ్చారంటూ మండిపడ్డారు. తమ కష్టాన్ని గుర్తించకుండా ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారని.. ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని వీఆర్వోలు ఆవేదన చెందుతున్నారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. అందరిపైనా నిందలువేసి ఇతర శాఖలకు పంపవద్దని ప్రభుత్వానికి విన్నవించారు.

Advertisement