ఎంఆర్ఎఫ్ ఏకీకృత నికర లాభం రూ. 679 కోట్లు

దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రముఖ టైర్ల దిగ్గజ కంపెనీ ఎంఆర్ఎఫ్ ఏకీకృత నికర లాభం రూ. 679.02 కోట్లుగా ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం కంటే రెండు రెట్లు పెరిగినట్టు కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ. 293.93 కోట్లుగా తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ. 3,685.16 కోట్లు ఉండగా, అంతకుముందు ఇదే త్రైమాసికంలో రూ. 4,137.67 కోట్లుగా ఉండేదని ఎంఆర్ఎఫ్ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఏకీకృత నికర లాభం గతం ఆర్థిక సంవత్సరంలో రూ. 1,130.61 కోట్లు కాగా, ఈసారి రూ. 1,422.57 కోట్లని పేర్కొంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 16,062.46 కోట్లు కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,239.36 కోట్లని వెల్లడించింది. గత కొంతకాలంగా ఆటోమొబైల్ రంగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున మార్కెట్‌లో డిమాండ్ సమస్య నెలకొందని, అది టైర్ల పరిశ్రమపై ప్రభావం పడనుందని కంపెనీ అభిప్రాయపడింది. అయితే, టైర్ల దిగుమతులపై ఆంక్షలు విధించాలన్న ప్రభుత్వ ప్రకటనతో దేశీయ పరిశ్రమలకు కొంత సానుకూలత ఉంటుందని ఎంఆర్ఎఫ్ తెలిపింది. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఒక్క షేర్‌కు రూ. 94 తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.

Advertisement