రాహుల్ వద్దంటే ఎన్నికలు పెట్టండి : శశిథరూర్

by  |
రాహుల్ వద్దంటే ఎన్నికలు పెట్టండి : శశిథరూర్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించాలని గత కొంత కాలంగా ఆ పార్టీ ముఖ్యనేతలు సోనియా గాంధీని కోరుతున్నారు. అంతేకాకుండా రాహుల్ ముందుకు వచ్చి మరల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని సైతం సీనియర్ లీడర్లు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. అయితే, రాహుల్ అందుకు సుముఖంగా లేడని తెలుస్తోంది. అసలే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఈలాంటి సమయంలో పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడి నియామకం జరిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకురావొచ్చని పలువురు సీనియర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఈ విషయం పై కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించేందుకు రాహుల్ గాంధీ ముందుకు రాకపోతే ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించాలని శశి థరూర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, సీడబ్ల్యూసీ పదవుల విషయంలోనూ అదే పంథా కొనసాగించాలని నిర్మొహమాటంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మనసుల్లో ఓ విశ్వసనీయమైన ప్రతిపక్షంగా నిలిచిందని.. కావున, వెంటనే పూర్తి కాలపు అధ్యక్షుడి నియామకం చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.

ముందుగా అధ్యక్ష నియామకం ఓ కొలిక్కి వస్తే.. ఆ తర్వాత పార్టీ కేడర్, నిర్మాణం తదితర అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పుడు కూడా పూర్తి కాలపు అధ్యక్షులు లేకపోవడం పార్టీని ఇబ్బందిని పెట్టే అంశమన్నారు. ఒకవేళ రాహుల్ బాధ్యతలు స్వీకరిస్తే 2022 వరకు పదవిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని, అది సాధ్యం కాకపోతే మాత్రం.. వేరొక పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలని శశిథరూర్ పార్టీ పెద్దలకు సూచించారు.

ఇదిలా ఉండగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికీ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి సోనియా గాంధీ కాంగ్రెస్ తాత్కాళిక అధ్యక్షురాలిగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే, రాహుల్ రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తిరిగి బాధ్యతలు స్వీకరించి, పార్టీని, కార్యకర్తలను ఒక తాటిపైన నడిపించాలని ఎంపీ శశిథరూర్ కోరుతున్నారు.



Next Story