కొడుకుపై ఉన్న ప్రేమ రైతులపై లేదు

by  |
కొడుకుపై ఉన్న ప్రేమ రైతులపై లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొడుకుపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వారసత్వ ప్రక్రియను మరింత పటిష్టం చేసుకోవడానికి, భవిష్యత్ టీఆర్ఎస్ నాయకుడిగా మీ పార్టీ శ్రేణుల్లో అతని గుర్తింపును పదిలం చేసుకునేందుకు ఈ సంక్షోభ సమయాన్ని మీరు వాడుకున్న తీరు అత్యంత హేయం అన్నారు. మీకు ప్రత్యామ్నాయంగా కేటీఆర్‌ను చూపించే తాపత్రయం తప్ప, రైతుల ఆవేదనను తీర్చే చిత్తుశుద్ధి మీ చర్యల్లో కనపించట్లేదన్నారు. వరంగల్ నగరంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ షో చేసి.. బాధ్యతను తీర్చేసుకున్నారని బుధవారం సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో వారంరోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వరంగల్ భూపాలపల్లి, ములుగు, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్ధిపేట, జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. కరీంనగర్, నిజామాబాద్, దక్షిణ తెలంగాణలో పాక్షికంగా పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రాథమికంగా ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు సమాచారం అందుతోందని, ఈ నష్టాన్ని పూడ్చేందుకు మీ దగ్గరున్న ప్రణాళిక ఏంటని ప్రశ్నించారు. వరి, పత్తి, మిర్చి, కంది, పెసర, సోయాబిన్ రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరికి ఈ వర్షాలతో నష్టం లేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటన చేయడం అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. ఇసుక మేటలు తొలగించి, చదును చేసుకుంటే తప్ప తిరిగి పనులు మొదలు పెట్టుకోవడానికి అవకాశం లేదన్నారు. ప్రభుత్వం వాటాగా రూ.513.5 కోట్లు చెల్లించనందున బీమా కంపెనీల నుంచి రూ.960 కోట్లు నిలిచిపోయాయన్నారు.

ఫసల్‌ బీమా పథకాన్ని అటకెక్కించారని, దానికి ప్రత్యామ్నాయంగా కొత్త బీమా పథకం ఏదైనా తెచ్చారా అంటే అదీ లేదన్నారు. తక్షణం వ్యవసాయశాఖ మంత్రి క్షేత్ర పర్యటనకు వెళ్లి, త్వరితగతిన పంట నష్టాన్ని అంచనా వేయించాలని, రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. దీనికోసం తక్షణమే రూ.వెయ్యికోట్లు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎరువుల కొరతను తీర్చి, ఇసుక మేటతో, భూమికోతతో అస్తవ్యస్తంగా మారిన భూములను బాగు చేసుకోవడానికి ఎకరాకు రూ.5వేల ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో ఎంపీ రేవంత్‌రెడ్డి కోరారు.



Next Story