ఆంధ్రా ముసుగేసి జనాన్ని నమ్మిస్తున్నారు

by  |
ఆంధ్రా ముసుగేసి జనాన్ని నమ్మిస్తున్నారు
X

దిశ, న్యూస్‌బ్యూరో: సచివాలయం కూల్చివేతపై సీఎం కేసీఆర్ పిచ్చి తుగ్లక్ పనులను సమర్ధించుకుంటున్నారని, దానిలో భాగంగా విష ఫార్ములాను వాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సచివాలయం కూల్చివేతలపై మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విష ఫార్ములాను బయటకు తీశారని, దాన్ని తన అధికారిక పత్రికలో బుసలు కొట్టిస్తున్నారన్నారు. సచివాలయం కూల్చివేతను వలస పాలకుల ప్రతీకగా అభిర్ణించడం, ఆంధ్రా ముసుగు వేసి జనాన్ని నమ్మించే ఎజెండాను అమలు చేస్తున్నారన్నారు. సచివాలయం ఎవరి ప్రతీక అని ప్రశ్నించారు. కూల్చివేస్తున్న సచివాలయం 26ఎకరాల స్థలంలో ఉందని, మొత్తం 11 బ్లాక్‌లు ఉన్నాయని, దీనిలో నిజాం కట్టించిన సైఫాబాద్ ప్యాలెస్‌తో పాటు 120 ఏళ్ల నాటి నల్ల పోచమ్మ దేవాలయం, మసీదులున్నాయన్నారు. ఇప్పుడు అవన్నీ వలస పాలకుల ప్రతీకలని సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. సచివాలయం జీ బ్లాక్ 1886లో ఆరో నిజాం నిర్మించాడని, దీనిలో తెలంగాణ ప్రజల రక్తం, స్వేదం, కష్టం ఉందన్నారు. ఇటీవల మీడియాను తీసుకెళ్లినా మసీదు, గుడి దగ్గరకు అనుమతించలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

సచివాలయం ఇప్పుడు కేంద్రహోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి నియోజకవర్గంలో ఉందని, అయినా ఆయన మాట్లాడకపోవడం సీఎం కేసీఆర్‌తో గూడుపుఠాణీలో భాగమేనన్నారు. సీఎం కేసీఆర్ వలస పాలన ప్రతీక అని, తాను తెలంగాణ వాడినని, పూర్వికులు బీహార్ నుంచి వచ్చారని, అప్పుడు ఏపీలోని విజయనగరం జిల్లాలో సెటిల్ అయ్యారని, అక్కడ నుంచి తెలంగాణకు వచ్చినట్లు సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారని రేవంత్‌రెడ్డి వివరించారు. వలస పాలనకు అసలైన ప్రతీక సీఎం కేసీఆర్ మాత్రమేనని, వలస పాలన ప్రతీక ఆనవాళ్లు పోవాలంటే సీఎంను రాష్ట్ర సరిహద్దులు దాటించి తరమికొట్టాలని పిలుపునిచ్చారు. సచివాలయం కూల్చివేతతో సీఎం కేసీఆర్ తనే చరిత్ర కావాలని కుట్ర చేస్తున్నారని, వాస్తు పండితుడి సూచనల ప్రకారం తన కొడుకును సీఎం చేయడం కోసమే సచివాలయాన్ని కూల్చుతున్నారని మండిపడ్డారు. జీ బ్లాక్ కింద గుప్త నిధులున్నాయని మేధావులు సైతం చెప్పుతున్నారని, ముందుగా జీ బ్లాక్‌ను ఎందుకు నేలమట్టం చేస్తున్నారో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.



Next Story