అడ‌విలో దీక్ష చేస్తే అరెస్ట్‌ చేయడమేంటి: రేవంత్!

by Shyam |
అడ‌విలో దీక్ష చేస్తే అరెస్ట్‌ చేయడమేంటి: రేవంత్!
X

దిశ‌, రంగారెడ్డి: జ‌గ‌న్ జ‌ల‌దోపిడిని మేం అడ్డుకుంటే సీఎం కేసీఆర్‌కు ఇబ్బంది కలుగుతోందని టీ-పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జ‌లాల వినియోగంలో తెలంగాణ‌కు జ‌రిగే అన్యాయంపై కాంగ్రెస్ నేతలు దీక్ష చేస్తామంటే అనుమ‌తి ఇవ్వ‌కుండా అరెస్ట్‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. దీక్ష‌కు అనుమ‌తి లేక‌పోవ‌డంతో ఎంపీ రేవంత్ రెడ్డిని మంగళవారం కొడంగ‌ల్‌లోని త‌న నివాసంలోనే పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌ను దిగ్భంధం చేస్తే స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుందనే అడ‌విలో దీక్ష చేస్తే.. పోలీసులు అరెస్ట్ చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంద‌న్నారు. ఏపీ జ‌ల‌దోపిడిని రాష్ట్ర ప్ర‌భుత్వం అడ్డుకోకుండా తాము పోరాటం చేస్తుంటే అరెస్ట్‌లు చేయ‌డంలో ఆంత‌ర్యం ఏంటని రేవంత్‌ ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ జ‌ల దోపిడికి సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తు పూర్తిగా ఉంద‌ని.. ఇది తెలంగాణ రాష్ట్ర అవిర్భావం సంద‌ర్భంగా బ‌హిర్గ‌త‌మైంద‌న్నారు. ఏపీ జలదోపిడితో ఉమ్మ‌డి ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారే ప్ర‌మాదముందన్నారు. శ్రీ‌శైలం, నాగార్జున సాగ‌ర్‌, పులిచింత‌ల ప‌వ‌ర్ ప్రాజెక్టుల ద్వారా 2,605 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జ‌రుగుతుందన్నారు. ఇందులో 54 శాతం వాటా తెలంగాణకు.. అంటే 1,400 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.0.14 పైస‌ల‌కు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా.. జుమేరాత్ బ‌జార్‌లో తూకానికి విక్ర‌యించేలా కేసీఆర్ ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని విమ‌ర్శించారు.

Advertisement

Next Story

Most Viewed