పాలమూరుపై రేవంత్ రెడ్డి ఎఫెక్ట్

by Anukaran |
పాలమూరుపై రేవంత్ రెడ్డి ఎఫెక్ట్
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముందుకు నడిపించే సరైన నాయకత్వం లేక ఉమ్మడి పాలమూరు జిల్లాలో చతికిల పడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు తమ భవితవ్యం ఏంటనే ఆలోచనలలో పడ్డారు. యువతలో మంచి క్రేజ్ ఉన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అధిష్టానం పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెడితే సరి.. లేదంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలువురు నాయకులు బీజేపీ బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయా జిల్లాల వారీగా కాంగ్రెస్‌లో పరిణామాలు మారే పరిస్థితులు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో..

రేవంత్‌రెడ్డి సొంత మండలం అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు.. తన రాజకీయ జీవితం ఆరంభం అయ్యింది కల్వకుర్తి నియోజకవర్గం కావడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల పార్టీ బలోపేతం కావడానికి అవకాశాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. ఇంతకు ముందు నియోజక వర్గాలపై పట్టున్న నేతలు చేరితే తప్ప ఆ రెండు నియోజకవర్గాల్లో రేవంత్ రాక పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.

మహబూబ్‌నగర్ జిల్లాలో..

మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబ్‌నగర్, జడ్చెర్ల, దేవరకద్ర ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో ఉన్న నాయకుల్లో ఐక్యమత్యం లేక పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. చాలామంది నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీలో చేరిపోయారు. మరోవైపు బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కిన కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. తటస్థంగా ఉన్న నాయకులు, కార్యకర్తలతో పాటు మైనార్టీలు కొంత మేర ఆపార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.. అంతకు మించి ప్రయాజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేవరకద్ర నియోజక వర్గంలో పార్టీ కార్యక్రమాలను ప్రదీప్ గౌడ్, మధుసూదన్ రెడ్డి ముందుకు తీసుకెళుతున్నారు. వారిలో సఖ్యత లేక ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో నియోజకవర్గంలోని కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారు. రేవంత్ రెడ్డికి బాధ్యతలు వచ్చినా పార్టీ బలోపేతం కావడం అంత సులభం కాదు. జడ్చెర్ల నియోజకవర్గంలో మల్లు రవి, అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయి. రేవంత్ రెడ్డి సన్నిహితులు, బంధువులు ఎక్కువ సంఖ్యలో ఉన్న కారణంగా ప్రస్తుతానికి కొంతమేర పార్టీకి కొంత ఊపు రావచ్చు.

నారాయణపేట జిల్లాలో..

నారాయణపేట జిల్లాలో నారాయణ పేట, మక్తల్, కొడంగల్ నియోజక వర్గాలు ఉన్నాయి. కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ పనిచేసినా ఆయన ప్రభావం కొడంగల్‌కే పరిమితం అయ్యింది.. పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌కు వస్తే పార్టీ పూర్వ వైభవం పొందే అవకాశాలు ఉన్నాయి. నారాయణపేటలో శివకుమార్ రెడ్డి బలమైన నేతగా ఉండడం, రేవంత్ రెడ్డికి పీసీసీ అదనపు బలం అవుతుంది.. కానీ బీజీపీ సైతం ఇప్పటికే మంచి పట్టు సాధించే దిశగా అడుగులు వీస్తుండడంతో మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు సాగే పరిస్థితులు ఉన్నాయి. మక్తల్‌లో టీఆర్ఎస్, బీజీపీ బలంగా ఉన్నాయి.. కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగిన నాయకులు, కార్యకర్తలు లేకపోవడంతో పార్టీ బలోపేతం కావడం కష్టమే.

వనపర్తి, గద్వాల జిల్లాలలో..

వనపర్తి జిల్లాలో వనపర్తి నియోజక వర్గం, గద్వాల జిల్లాలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. వనపర్తిలో పార్టీ కార్యక్రమాలను మాజీ మంత్రి చిన్న రెడ్డి, అలంపూర్‌లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాకతో కొంత ప్రయోజనం ఉండవచ్చు. గద్వాల కాంగ్రెస్‌లో చెప్పుకోదగ్గ నాయకులు లేకపోవడంతో రేవంత్ ప్రభావం ఉండదు.

పీసీసీ రాకుంటే బీజేపీ బాటే..

రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రాకుంటే ఆయా నియోజక వర్గాల నాయకులు బీజేపీ బాట పట్టే అవకాశాలు ఉన్నాయి.. 2022లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రజల్లో అభిమానం సాధిస్తున్న బీజేపీ వైపు వెళ్లే ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం. మరికొంతమంది అధికార పార్టీ అవకాశం ఇస్తే అటువైపు వెళ్లే ఆలోచనలలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కుతే సరి, లేదంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed