సిద్ధిపేటలో పబ్ కావాలి.. మంత్రి హరీష్‌ను కోరిన ఎంపీ.. అవాక్కైన ప్రజలు

by Anukaran |
సిద్ధిపేటలో పబ్ కావాలి.. మంత్రి హరీష్‌ను కోరిన ఎంపీ.. అవాక్కైన ప్రజలు
X

దిశ ప్రతినిధి, మెదక్: ‘సిద్దిపేటకి అన్నీ చేశారు. నాదొక చిన్న విన్నపం. ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు కొందరు యువతులు రెండు, మూడు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అన్న మేము రోజు సాయంత్రం హైదరాబాద్ పోతున్నాం. సిద్దిపేటలో పబ్స్ లేవు. ఇక్కడ సిద్దిపేటలో ఒక్క పబ్ ఉంటే బాగుంటుంది. రోజూ హైదరాబాద్ పోయి రావడం ఇబ్బందిగా ఉంది. వచ్చేటప్పుడు పోలీసులు పట్టుకుంటున్నారు. అది కూడా ఒక్కటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది ఒక్కటే తప్ప సిద్దిపేటలో అన్నీ ఉన్నాయి. త్వరలోనే దాన్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది’ అంటూ సిద్దిపేటలో టూరిజం హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలివి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దీనిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వివాదాస్పదమైన ఎంపీ వ్యాఖ్యలు

యువత కాస్త పెడదారి పడుతుంది. మద్యం, డ్రగ్స్ కి బానిసలవుతున్నారు. ఇలాంటి వారిని సరైన మార్గంలో ఎలా పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న వేళ అధికార పార్టీకి చెందిన ఎంపీ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. వికృత చేష్టలకు నిలయమైన పబ్ కల్చర్ ను సిద్దిపేటకు తీసుకురావాలని మంత్రిని ఎంపీ కోరడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైపు పబ్ కల్చర్ ను అంతం చేయాలని పలువురు కోరుతుంటే.. ఎంపీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడమేంటని పలువురు ఆ పార్టీకి చెందిన నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే యువత మద్యం, డ్రగ్స్ కి అలవాటు పడి భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా పోలీస్ నిఘా పెట్టి డ్రగ్స్ అమ్ముతున్న, కొంటున్న వారిపై చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి వేళ సరికొత్తగా సిద్దిపేటకు పబ్స్ తీసుకురావాలని మాట్లాడటంపై పలువురు గుర్రుమంటున్నారు.

మౌనంగా ఉండిపోయిన మంత్రి

ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాటలు విన్న మంత్రి హరీశ్ రావు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాస్త టెన్షన్ కి లోనయ్యారు. మెదక్ ఎంపీ మాటలకు సమాధానం చెప్పలేక కాస్త చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయారు. ఎంపీ అనంతరం మంత్రి మాట్లాడిన సమయంలోనూ ఎంపీ మాట్లాడిన మాటలు ప్రస్తావించినప్పటికీ దానిపై ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీనిపై మంత్రి ఎలా స్పందిస్తారో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంపీ మాటలను నిజం చేస్తూ సిద్దిపేటలో పబ్ ఏర్పాటు చేస్తారో లేక యువత పెడదారి పట్టే అవకాశం ఉన్నందున ఎంపీ మాటలను తిరస్కరిస్తారో లేదో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఎంపీ తీరుపై అగ్రహం

ప్రశాంతంగా ఉన్న సిద్దిపేటకు విష సంస్కృతి అలవాటు చేయాలనుకుంటున్నారా అంటూ కొందరు నెటిజన్లు మెదక్ ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేటలో యువతకు మంచి ఉపాధి మార్గాలు చూపించాలని కోరడం బదులు.. యువత చెడిపోయేందుకు పబ్ తీసుకురావాలని కోరడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొందరు ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం మానేసి మద్యానికి బానిసలను చేస్తున్నారు. ఇప్పటికే మద్యం షాపులు పెంచారు. ఇక యువతను మరింత మత్తులోకి దించేందుకు పబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారా అంటూ ప్రభుత్వ తీరు, ఎంపీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వెంటనే ఎంపీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed