చిన్నారి మృతికి వాళ్లు కూడా కారణమే.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణ

by Shyam |
MP Komatireddy Venkat Reddy
X

దిశ, ఎల్బీనగర్: హైదరాబాద్‏లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైదాబాద్‌లోని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెబుతున్నారు. తాజాగా.. కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేయడం దుర్మార్గం అని అన్నారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ సహా ఒక్క మంత్రి కూడా రాకపోగా, నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

చిన్నారి మృతికి ఆ రాక్షసుడు ఎంత కారణమో పోలీసులు కూడా అంతే కారణమని ఆరోపించారు. రాష్ట్ర రాజధానిలో ఇంత ఘోరమైన ఘటన జరిగితే తండ్రీకొడుకులు ప్రగతి భవన్‌లో కూర్చుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని ప్రజలు పట్టిస్తే.. పోలీసులు గాడిదలు కాయడానికి ఉన్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, బంజారాహిల్స్‌లో మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌లకు వైన్‌షాప్ ఉందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుస్తోందని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకొని ఈ సంఘటన ఆయన దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed