ప్రైవేట్ ఆస్పత్రులు దోచుకుంటున్నాయ్ : బండి

by  |
ప్రైవేట్ ఆస్పత్రులు దోచుకుంటున్నాయ్ : బండి
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు విచ్చలవిడిగా డబ్బులు దండుకుంటున్నాయని బీజేపీ ఆరోపించింది. శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందన్నారు.

పేదలు సైతం ప్రైవేట్ హాస్పిటల్ వైపు చూస్తుండటంతో ఇదే అదునుగా తీసుకుని కొన్ని ప్రయివేటు యాజమాన్యాలు రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకత్వం ఆస్పత్రుల వద్ద పేద ప్రజలకు అండగా నిలబడాలని సంజయ్ పిలుపునిచ్చారు. డాక్టర్ల పట్ల, పారామెడికల్ స్టాఫ్‌కు మద్దతుగా ఉంటూ, వారు సేవలను గుర్తిస్తుందని వివరించారు. విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా సేవలందించాలే గానీ, ధనార్జనే ధ్యేయంగా పనిచేయడం చాలా బాధాకరమని బండి సంజయ్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే ఇదంతా సాగుతోందన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదన్నారు. వైద్యాన్ని ఉచితంగా అందించక పోయినా ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని ధనార్జనకు పాల్పడరాడని బీజేపీ విజ్ఞప్తి చేస్తుందని సూచించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కుమారి బంగారు శృతి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed