పార్కింగ్ కోసం వాహనదారులు పరేషాన్

by  |
పార్కింగ్ కోసం వాహనదారులు పరేషాన్
X

దిశ, కరీంనగర్ సిటీ: స్మార్ట్ సిటీ గా రూపుదిద్దుకుంటున్న నగరంలో పార్కింగ్ కోసం వాహనదారులు పరేషాన్ అవుతున్నారు. ప్రధాన రహదారుల సమీపంలో వాహనాలు నిలిపేందుకు కనీస స్థలం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యాపార సముదాయాల ఎదుట కూడా నిలబడే చోటు లేక వాహనచోదకుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. రోడ్ల పక్కన నిలిపితే ఈ చలాన్లు, సమీపంలో ఖాళీ స్థలం లేక నానా అగచాట్లు పడుతున్నారు.

పార్కింగ్ కేటాయింపేదీ?

నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారుల విస్తరణ చేపట్టిన, పార్కింగ్ స్థలాలు మాత్రం కేటాయించకపోవడంతో నగర వాసులతో పాటు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చిపోయే ప్రజలు వాహనాలపై నగరంలో ప్రయాణించాలంటే బెంబేలెత్తుతున్నారు. రాంగ్ పార్కింగ్ పేర వస్తున్న ఈ చలాన్లు చెల్లించలేక తలలు పట్టుకుంటున్నారు. పార్కింగ్ ఇబ్బందులు తొలగించేందుకు నగరపాలక సంస్థ నాలుగేళ్ల క్రితమే నడుం బిగించినా, ఒకటి రెండు చోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో ఎక్కడా స్థలాలు లేక వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో బల్దియా నిర్ణయం..

నగరంలో ప్రధానంగా బస్ స్టాండ్ ఏరియా, వన్ టౌన్, గీతా భవన్ సర్కిల్, కోర్టు చౌరస్తాతో పాటు కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించేందుకు బల్దియా పాలకవర్గం గతంలో నిర్ణయించింది. అయితే, వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో మున్సిపల్ అతిథిగృహం కింద మాత్రమే మార్కెట్ కు వచ్చిపోయే వారు వాహనాలు నిలుపుకునేందుకు స్థలం కేటాయించి, మిగతా ప్రాంతాల్లో పట్టించుకోవడం లేదు. దీంతో ఆయా చోట్ల అత్యవసర పరిస్థితుల్లో సైతం వాహనాలు నిలిపిన వారికి నిమిషాల్లోనే ఈ చాలన్ మెస్సేజ్‌లు వస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక కొంత మంది వాహనాలు ఇళ్లలో నుంచి బయటకు తీయకుండా, నడక దారినే ఎంచుకుంటున్నారు.

ఈ చలాన్లు..

నో పార్కింగ్ రాంగ్ వే, రాంగ్ క్రాసింగ్ లాంటివి చేయడమే తరువాయి తమ కెమెరాల్లో బంధిస్తూ, ఆ వెంటనే వాహనదారుల మొబైల్ ఫోన్లకు చలాన్లు పంపుతున్నారు. ప్రధాన రహదారులు విస్తరించిన అనంతరం నడకదారులు సైకిల్ చోదకులకు కూడా బల్దియా అధికారులు దారులు ఏర్పాటు చేయగా, వాహనాలు నిలిపేందుకు మాత్రం కేటాయించకపోవడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా, జన సమర్థ ప్రాంతాలు, వ్యాపార కూడళ్లలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

ఖాళీ స్థలాలు లేవు..

నేను వివిధ పనుల నిమిత్తం తరచూ నగరంలో తిరుగుతుంటాను. ఎక్కడా పార్కింగ్ ప్లేస్ లేక ఏదో ఓ చోట పార్కింగ్ చేస్తున్నా. రోడ్లపై నిలిపితే పోలీసులు చలాన్లు పంపుతున్నారు. దగ్గరలో ఖాళీ స్థలాలు లేక నానా తంటాలు పడాల్సి వస్తోంది.

-లక్ష్మణ్, వాహనదారుడు

పార్కింగ్ ప్లేస్ కేటాయించాలె..

రోడ్లు వెడల్పు చేసిన వాహనాలు నిలుపుకునేందుకు స్థలం కేటాయించకపోవడంతో రోడ్లపైనే నిలపాల్సి వస్తోంది. పోలీసులు వచ్చి ఫోటోలు తీస్తున్నారు. బతిలాడినా ఫెనాల్టీలు ఆగడం లేదు. ఇప్పటికే నా బండిపై రూ. 3,800 ఫైన్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా రాంగ్ పార్కింగ్ చలాన్లే ఉన్నాయి. అధికారులు స్పందించి, పార్కింగ్ ప్లేస్‌లు కేటాయించాలి.

-ఎన్.శంకర్, వాహనదారుడు

Advertisement

Next Story

Most Viewed