కరోనాతో తల్లి మృతి, ఇంతలోనే ఆ ఇంట మరో విషాదం

by Sumithra |   ( Updated:2021-07-17 08:24:03.0  )
Bhavani2
X

దిశ, చిట్యాల : తల్లి రెండు నెలల క్రితం కరోనాతో మృతి చెందిందని మనోవేదనకు గురైన బిడ్డ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితలలో శనివారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్టేం వీరస్వామి భార్య వరలక్ష్మి(35) ఇటీవలే కరోనాతో మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

కాగా, తల్లి చనిపోయినప్పటి నుంచి చిన్న కూతురు భవాని(17) తల్లి లేదని మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో తమ ఇంటి వెనకాల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అది గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే, ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం భవాని మృతిచెందింది. ఈ నేపథ్యంలో తండ్రి పట్టేం వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఇమ్మడి వీరభద్రరావు తెలిపారు. తల్లి చనిపోయిన రెండు నెలలకే బిడ్డ చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అయితే, నిరుపేద కుటుంబమైనా వారిని చూసి.. మనసు చలించిపోయిన ఎస్‌ఐ ఇమ్మడి వీరభద్ర రావు గతంలో పట్టేం వరలక్ష్మి అంత్యక్రియలకు ముందుకు ఎవరు రాకపోవడంతో దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. నేడు ఆమె బిడ్డ భవాని ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో.. యువతి అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మానవత్వాన్ని చాటుకున్న ఎస్ఐని గ్రామ సర్పంచ్ సాంబ లక్ష్మి, గ్రామస్తులు అభినందించారు.

Advertisement

Next Story