అనాథాశ్రమం: దర్యాప్తులో మరికొన్ని నిజాలు

by Shyam |   ( Updated:2020-08-15 22:24:09.0  )
అనాథాశ్రమం: దర్యాప్తులో మరికొన్ని నిజాలు
X

దిశ ప్రతినిధి, మెదక్ : ‘అభాగ్యులకు, అనాథ పిల్లలకు అండగా ఉంటాం. వారిని ప్రయోజకులను చేసే బాధ్యత మాదే. మేము సామాజిక, సంఘ సేవకులం.’ అంటూ వెలిసిన ఓ అనాథాశ్రమం గుట్టు బట్టబయలైంది. అభం, శుభం తెలియని బాలికలపై లైంగికదాడికి పాల్పడుతున్న ఉదంతం ఇటీవలే సంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించింది. అంతా గుట్టుగా సాగుతుందని ఆశ్రమ నిర్వాహకులు అనుకున్నారు. కానీ బాలిక మరణంతో అసలు విషయం బయటపడింది.

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లోని మారుతి ఆర్ఫనస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అనాథాశ్రమంలో చాలా మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఆశ్రమంలో ఐదో తరగతి చదువుతున్న 14 ఏండ్ల అనాథ బాలికపై ఆశ్రమానికి విరాళాలు ఇచ్చే దాత లైంగికదాడికి పాల్పడ్డాడు. లాక్‌డౌన్ కారణంగా ఆ బాలిక బంధువుల ఇంటికి వెళ్లింది. అనంతరం అనారోగ్యంతో బాదపడుతుండటంతో అక్కడి వారు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బటయపడింది. లైంగికదాడికి పాల్పడటం వల్ల ఇన్‌ఫెక్షన్ సోకి, అది శరీరమంతా వ్యాపించి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇటీవలే ఆ బాలిక మృతి చెందింది. దీంతో ఆశ్రమం గుట్టు రట్టయింది. ఈ ఘటనతో మారుతి అనాథ ఆశ్రమం ఆగడాలు ఇంకా చాలా ఉన్నాయన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

రిజిస్ట్రేషన్ అక్కడ.. నిర్వహణ ఇక్కడ..

అసలు ఈ సంస్థ ఏ జిల్లాలో రిజిస్టర్ అయింది? ఏ జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది? ఆశ్రమంలో ఉండాల్సిన పిల్లలు ఎంత మంది ? ఉన్నది ఎంత మంది? స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ ఆశ్రమానికి రేయింబవళ్లు అధికారుల స్టిక్కర్లు గల వాహనాలు రాకపోకలు ఎందుకు సాగించేవి ? ఈ ప్రశ్నలు ఇప్పటికే చాలా మంది అనుమానాలు కలిగిస్తున్నాయి. ఆంధ్ర ప్రాంత బడా నాయకులతో పాటు గల్లీ లీడర్లు సైతం ఆ అనాథాశ్రమానికి వచ్చి పోయేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆశ్రమం రంగారెడ్డి జిల్లాకు చెందినదిగా రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దీన్ని నడుపుతున్నారు. ఆశ్రమ భవనానికి ఉంచిన బోర్డుపై రంగారెడ్డి జిల్లా మియాపూర్ అని ఉండటం గమనార్హం.

వేరు వారు వచ్చేవారని ఆరోపణలు..

కొందరు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఇక్కడి చిన్నారులతో పాటు కొన్ని సందర్భాల్లో వేరే యువతులు వచ్చి పోయేవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడకు చెందిన నిర్వాహకురాలు విజయ ఇక్కడ స్థిరపడి అనాథాశ్రమాన్ని నిర్వహిస్తోంది. ఎస్ఆర్ఏ‌ల నుంచి విరాళాలు సేకరించేదని, దీంతో స్వల్ప కాలంలోనే రూ.2 కోట్ల విలువైన భవనం నిర్మించినట్టు తెలుస్తోంది. ఆశ్రమంలో ఉన్న చిన్నారులందరూ రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ సిఫారసు చేసిన వారే. అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ 49 మంది విద్యార్ధినులు ఉండాలి. కానీ సుమారు 60 మంది వరకు బాలికలు ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఆశ్రమం పేరుతో కొందరు బడా బాబులు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ ఆ్రశమంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

మరో బాలికపైనా?

అనాథ ఆశ్రమంలో ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మరో బాలికపై కూడా నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఓ బాలిక ఏడాదిగా లైంగికదాడికి గురై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం చనిపోయింది. ‘మరో బాలికపైనా నిందితుడు వేణుగోపాల్‌రెడ్డి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక సైతం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయను ప్రశ్నించారు. వారిని విజయ బెదిరించడంతో వారు ఆ బాలికను తీసుకొని వెళ్లారు. ఈ విషయాన్ని మా పాప నాతో చెప్పింది’ అని మృతి చెందిన బాలిక పిన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జయదీప్ నిందితుడికి సహకరించేవారిని వెల్లడైంది. ఈ విషమంపై మేజిస్ట్రేట్ ఆశాలత శుక్రవారం మారుతి అనాథాశ్రమానికి వెళ్లి ఆశ్రమ సిబ్బందిని విచారించింది.

నేరస్థులను ఉరి తీయాలి: తోకల ఉమారాణి, బీజేపీ మహిళా మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు

బాలికపై లైంగిక దాడికి పాల్ప డిన వారిని, అందుకు సహకరించిన విజయను ఉరితీయాలి. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం సిగ్గుచేటు. దీన్ని బీజేపీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed