ఆత్మ నిర్బర్ ప్యాకేజీపై వెల్లువెత్తుతున్న విమర్శలు!

by Harish |
ఆత్మ నిర్బర్ ప్యాకేజీపై వెల్లువెత్తుతున్న విమర్శలు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: కేంద్రం గొప్పగా ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ప్యాకేజీతో ఆర్థిక సంస్థల సంపద తగ్గిపోకుండా కాపాడుకోవడమే కానీ, కరోనా సంక్షోభం నుంచి కోలుకునేందుకు ఇది ఏ మాత్రం పనిచేయదని మూడీస్ వెల్లడించింది. గత వారం ప్యాకేజీ ప్రకటనలో ఎమ్ఎస్ఎమ్ఈలకు రూ. 3.70 లక్షల కోట్లు, ఎన్‌బీఎఫ్‌సీలకు రూ. 75 వేల కోట్లు, విద్యుత్ పంపిణీ డిస్కంలకు రూ. 90 వేల కోట్ల సాయం ప్రకటించింది.

కరోనా సంక్షోభానికి చతికిలపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రకటనలు ఏ మాత్రం ఊతమివ్వవని వివరించింది. ఆర్థిక రంగాన్ని నష్టాల నుంచి కాపాడటానికి ఈ చర్యలు ఉపకరిస్తాయి. అయితే, కరోనా వ్యాప్తి వల్ల ఎదురైన నష్టాలను అధిగమించడానికి ఇది ఉపయోగపడవని మూడీస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎమ్ఎస్ఎమ్ఈలకు ఇచ్చిన ప్యాకేజీని ప్రస్తావిస్తూ..కరోనా రాకముందు నుంచే ఈ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వెనువెంటనే కరోనా సంక్షోభం చుట్టేయడంతో ఈ రంగానికి నగదు లభ్యత ఇంకా పెరిగిందని మూడీస్ వ్యాఖ్యానించింది. ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రకటించిన సాయం సదరు కంపెనీలకు తక్షణం అవసరమైన నగదు లభ్యత కంటే చాలా తక్కువని చెప్పింది. ఈ రంగం ద్వారా బ్యాంకులపై మరింత భారం తప్పదని మూడీస్ అభిప్రాయపడింది.

Advertisement

Next Story