వీడని మోనోలిత్ మిస్టరీ.. తాజాగా తూర్పు టర్కీలో ప్రత్యక్షం

by Shyam |
వీడని మోనోలిత్ మిస్టరీ.. తాజాగా తూర్పు టర్కీలో ప్రత్యక్షం
X

దిశ, ఫీచర్స్: మోనోలిత్‌ల మిస్టరీ ఇంకా వీడటం లేదు.. అసలు అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి? అకస్మాత్తుగా ఒకచోట ఎలా ప్రత్యక్షం అవుతున్నాయి? అన్న సంగతి ఇప్పటికీ తెలియడం లేదు. గతేడాది నవంబర్‌లో అమెరికాలోని ఉటా రాష్ట్రంలో తొలి మోనోలిత్(లోహపు స్తంభం) ప్రత్యక్షం కాగా, ఇక అప్పటి నుంచి వరుసగా యూకే, టెక్సాస్, పోలాండ్, కాంబోడియా, కాలిఫోర్నియా తదితర ప్రదేశాల్లో మోనోలిత్‌లు కనబడుతూనే ఉన్నాయి. బరువైన ఈ లోహ స్తంభాలను ఆయా ప్రదేశాల్లో ఏలియన్లు తెచ్చి పెడుతున్నారా? లేక ఎవరైనా కావాలనే ప్లాన్ చేసి మరీ అక్కడ నిలబెడుతున్నారా? అనే విషయమై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టర్కీలో మరో మోనోలిత్ ప్రత్యక్షమైంది.

తూర్పు టర్కీలోని శాన్‌లియుర్ఫ ప్రావిన్స్‌లోని పురాతన దేవాలయం, యునెస్కో డబ్ల్యూహెచ్ఎస్(ప్రపంచ వారసత్వ కేంద్రం) గొబెక్‌లిప్టె వద్ద ఓ రైతుకు మోనోలిత్ కనబడింది. రైతు తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా దీన్ని చూసినట్లు పేర్కొన్నాడు. స్థానికంగా ఈ వార్త వైరల్ కావడంతో మోనోలిత్‌తో ఫొటోలు దిగేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. 3 మీటర్లు ఎత్తున్న ఈ మోనోలిత్‌పై టర్కీ లిపిలో ‘ఆకాశాన్ని, చంద్రున్ని చూడండి’ (Look at the sky, see the moon) అని రాసి ఉంది. ఆఫీసర్లు ఈ మోనోలిత్ వద్ద ఆర్మీని సెక్యూరిటీగా ఏర్పాటు చేశారు. ఈ విషయమైన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఏడాదైనా మోనోలిత్ మిస్టరీ వీడుతుందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక్క టర్కీ దేశం మాత్రమే లోహపు స్తంభం రక్షణకు ఆర్మీని సెక్యూరిటీ‌గా ఏర్పాటు చేసిందని ప్రశంసిస్తున్నారు. కాగా ఇది కచ్చితంగా ఏలియన్ల పనేనని, వారు భూమిపైనే ఉన్నారని కొందరు వాదిస్తున్నారు. ప్రపంచంలోనే పురాతన దేవాలయం, ప్రపంచ వారసత్వ కేంద్రం వద్ద మోనోలిత్ ఏర్పాటు చేస్తే మంచి జరుగుతుందని భావించే, ఇలా లోహపు స్తంభం ఏర్పాటు చేశారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story