లాక్ డౌన్ వేళ… ఆయ‌నకు హ్యాట్సాఫ్ చెప్పాలి!

by Shyam |   ( Updated:2023-03-15 02:19:39.0  )
లాక్ డౌన్ వేళ…  ఆయ‌నకు  హ్యాట్సాఫ్ చెప్పాలి!
X

దిశ, న‌ల్ల‌గొండ: ‘వాన‌లు కురువాలే .. కోతులు వాప‌స్ పోవాలే’ ఈ డైలాగో ఎక్క‌డో విన్న‌ట్టుంది క‌దూ! అవును మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్ హ‌రిత‌హారం మొక్క‌లు నాటే కార్యక్ర‌మాన్ని ప్రారంభించే రోజున అన్న మాట‌లివి. అడ‌వులు న‌రికివేయ‌డంతో ఆర‌ణ్యంలో ఉండాల్సిన కోతులు తిండి కోసం జ‌నార‌ణ్యంలోకి వ‌స్తున్నాయ‌న్న‌ది సీఎం మాట‌ల సారంశం. కానీ, జ‌నారణ్యంలోకి వ‌చ్చిన కోతులు చేస్తోన్న చేష్ట‌ల‌కు జ‌నాల‌ను వాటిని ఊర‌వ‌త‌లికి త‌రుముతున్నారు. కొన్ని గ్రామ‌ల్లో కోతుల బెడ‌ద‌ను నివారించ‌డానికి పాల‌క‌వ‌ర్గాలు ఆ ఊర్ల‌ల్లో ఉండే కోతుల‌ను ప‌ట్టించి దూరంగా చెట్ల పొద‌లు, గుట్ట‌లుగా ఉన్న ఖాళీ ప్రాంతాల్లో ర‌హ‌దారి ప‌క్క‌న విడిచి వెళ్తున్నారు.

ఇలా రంగారెడ్డి జిల్లాలోని ప‌లు గ్రామాల నుంచి చేనేత‌కు ప్ర‌సిద్ధి చెందిన పోచంప‌ల్లికి వెళ్లే దారిలోని ఉన్న కొత్త‌గూడెంకు ఐదు కిలోమీట‌ర్ల దూరంలో వ‌దిలివెళ్లారు. పోచంప‌ల్లి-హ‌య‌త్‌న‌గ‌ర్ వెళ్లే ర‌హ‌దారిలోని కొత్త‌గూడెంకు 5 కిలో మీట‌ర్ల ముందు మూసీ వాగు ప్ర‌వ‌హిస్తోంది. దీంతో అక్క‌డ ద‌ట్ట‌మైన చెట్ల‌తో కూడి పొద‌లు ఉన్నాయి. ఆ స‌మీపంలోనే చిన్న చిన్న గుట్ట‌లు ఉండ‌టం వ‌ల్ల భూగ‌ర్భ జ‌లాలు అక్క‌డ ఉండ‌టంతో ఆ ప్రాంతం చెట్లు ఉండ‌టం వ‌ల్ల ప‌చ్చ‌గా క‌నిపిస్తోంది.

ఇప్ప‌డు ఈ కోతుల స‌మూహానికి నివాసం ఈ ప్రాంత‌మే. అయితే అక్క‌డ మూగ‌జీవాలైన వానరాల‌కు తాగడానికి మూసీ కాలువ ఉండ‌టంతో అవి ఈ ప్రాంతం నుంచి వెళ్ళ‌డం లేదు. ఆ ప‌రిస‌రాల్లో పండ్లు, ఇత‌ర కాయ‌ల చెట్లు లేక‌పోవ‌డంతో ఆ ర‌హ‌దారికి ఇరువైపులా గుంపులు గుంపులుగా చేరుకొని తిండి కోసం పొద్దంతా అంగ‌లార్చుతాయి. ఆక‌లికి ఆగ‌లేక‌ దారి వెంట వాహ‌న‌దారులు, బాట‌సారులు తీసుకువెళ్తున్న ఆహార ప‌దార్థాలను గుంజుకొని క‌డుపు నింపుకుంటున్నాయి.మ‌న‌స్సును క‌దిలించింది..

ఇలాంటి వాన‌రాల‌ను చూసి ఎవ‌రైన బెంబేలెత్తిపోతారు. కానీ, యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంప‌ల్లి మండ‌లం ఏదులాబాద్‌కు చెందిన రావుల మోహ‌న్‌రెడ్డి మ‌న‌స్సు చ‌లించిపోయింది. తిండి కోసం అవి చేస్తోన్న పోరాటం ఆయ‌న మ‌న‌స్సును క‌దిలించింది. వ్య‌వ‌సాయం క‌లిగి ఉన్న ఆయ‌న స్వ‌త‌హాగా జంతు ప్రేమికుడు కావ‌డంతో ఆ మూగ‌జీవాలు తిండి కోసం ప‌డుతున్న వేదన‌ను గ‌మ‌నించాడు. వాటి ఆక‌లిని తీర్చాల‌ని భావించి వారానికి ఒకసారి ఆదివారం రోజున త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వ‌చ్చి వానరాల‌కు పండ్లు అందిస్తూ వాటి ఆక‌లిని తీర్చుతున్నాడు.కోతులు రోడ్డు దాటుతుండొచ్చు.. జాగ్ర‌త్త‌గా..

కోతులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో ఆ ర‌హ‌దారిపై రెండు కిలోమీట‌ర్ల పొడ‌వులో సుమారు మూడు మూల మ‌లుపులున్నాయి. రాత్రి స‌మ‌యాల్లో అవి రోడ్డు దాటే క్ర‌మంలో వాహ‌నాలు ఢీకొట్ట‌డంతో కొన్ని మృత్యువాత ప‌డ్డాయి. ఈ ప్ర‌మాదాలను నివారించేందుకు వాహ‌న‌దారుల‌ను అప్ర‌మ‌త్తం చేసే విధంగా రోడ్డుకు ఇరువైపులా సూచిక బోర్డుల‌ను ఏర్పాటు చేయించిండు. మూల‌మ‌లుపు వ‌ద్ద కోతులు రోడ్డు దాటుతుండొచ్చు జాగ్ర‌త్త‌గా వెళ్లండి అంటూ ఏర్పాటు చేసిన సూచిక బోర్డుల‌తో వాహ‌న‌దారులు జాగ్ర‌త్త ప‌డ‌టం వ‌ల్ల అప్ప‌టి నుంచి కోతుల‌కు ప్ర‌మాదం త‌ప్పింది.

ఎస్ఐకి ఈ విష‌యాన్ని చెప్పాడు..

అయితే, క‌రోనా నేపథ్యంలో గ‌త నెల 22 నుంచి జ‌న‌తా క‌ర్ఫ్యూ మొద‌లుకొని ఈనెల 14 వ‌ర‌కు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. దీంతో నిత్య‌ావ‌స‌ర వ‌స్తువుల‌కు మిన‌హా రోడ్ల‌పైకి వాహ‌నాదారుల‌ను, జ‌నాల‌ను పోలీసులు అనుమ‌తించ‌డం లేదు. అయితే, ఏదులాబాద్‌లో ఉన్న ఆయ‌న సుమారు 15 కిలోమీట‌ర్ల దూరం వెళ్లి ఈ వానారాల ఆక‌లి తీర్చ‌డం కుద‌ర‌లేదు. అయితే కొన్ని అత్య‌వస‌ర ప‌రిస్థితుల‌కు మిన‌హాయింపు ఉంటుంద‌ని తెలుసుకొన్న ఆయ‌న రెండు రోజుల క్రితం గ్రామానికి వ‌చ్చిన ఎస్ఐ వ‌ద్ద‌కు వెళ్లి ఈ విష‌యాన్ని చెప్పాడు. లాక్‌డౌన్ కార‌ణంగా అవి అక‌లితో అల‌మ‌టిస్తూ ఉంటాయ‌ని త‌న‌కు అనుమ‌తి ఇస్తే ఒక వాహ‌నంలో పండ్లు తీసుకొని వెళ్లి వాటికి వేస్తాన‌ని కోర‌డంతో ఉన్న‌తాధికారుల ఆమోదంతో ఎస్ఐ మోహ‌న్‌రెడ్డికి అనుమ‌తి ఇచ్చాడు. పోలీసుల నుంచి అనుమ‌తి రావ‌డంతో హైద‌రాబాద్ కొత్తపేట మార్కెట్‌కు వెళ్లి ట్రాలీ ఆటోలో పండ్లు కొనుగోలు చేసుకొని వెళ్లి కొత్త‌గూడెం శివారులో ఆక‌లితో న‌క‌న‌క‌లాడుతున్న వానారాల‌కు పండ్లును అందించి త‌న పిల్ల‌ల ఆక‌లి తీర్చినంత ఆనందాన్ని పొందాడు.

కేజ్రీవాల్ చేతుల మీదుగా అవార్డు..

లాక్‌డౌన్ కొన‌సాగుతున్న క్ర‌మంలో ఆ దారి వెంట వెళ్లే వారు త‌మ ఇండ్ల వ‌ద్ద మిగిలిపోయిన ఆహార ప‌దార్థాల‌ను మురికి కాల్వ‌ల్లో పార‌బోయ‌కుండా క‌వ‌ర్‌ల‌లో తీసుకొచ్చి ఆ మూగజీవాల ఆక‌లి తీర్చ‌డానికి అక్క‌డ ఉన్న చెట్ల పొద‌ల‌ల్లో వేయాల‌ని వేడుకున్నాడు. వాటి ప్రాణాల‌ను కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌ పౌరుడిపై ఉందంటున్నారు. కాగా, మోహ‌న్‌రెడ్డి స్వ‌త‌హాగా జంతు ప్రేమికుడు కావ‌డంతో గ‌తంలో ఆయ‌న చేసిన జంతు సేవ‌కుగాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డు వారు అవార్డును ఢిల్లీ ముఖ్య‌మంత్రి ఆర‌వింద్ కేజ్రీవాల్ చేతుల మీదుగా ఆయ‌నకు ప్రదానం చేశారు. మూగ జీవాల‌కు ఆక‌లి తీర్చాల‌న్న ఆయ‌న త‌ప‌న‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed