48 శాతం పెరిగిన మహీంద్రా ఆదాయం

by Harish |   ( Updated:2021-05-28 07:22:04.0  )
48 శాతం పెరిగిన మహీంద్రా ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి త్రైమాసికంలో రూ. 163 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 3,255 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో ఎంఅండ్ఎం, మహీంద్రా వాహన తయారీదారులు లిమిటెడ్(ఎంవీఎంఎల్) సంయుక్త ఆదాయాలు 48 శాతం పెరిగి రూ. 13,338 కోట్లకు చేరుకున్నాయి. కంపెనీకి చెందిన ట్రాక్టర్లు, ఆటోమోటివ్ విభాగాల్లో బలమైన డిమాండ్ కారణంగా ఆదాయం పెరిగినట్టు కంపెనీ తెలిపింది.

మొత్తంమీద మార్చి త్రైమాసికంలో కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత వల్ల ఈ త్రైమాసికంలో ఉత్పత్తి, అమ్మకాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఎదురైందని ఎంఅండ్ఎం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో షేర్‌కు రూ. 8.75 తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ఆమోదించింది. ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ రూ. 3,702 కోట్ల లాభాలను నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 2,713 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఆదాయం రూ. 74,278 కోట్లుగా కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story