టీఆర్ఎస్‌లో ‘మార్కెట్’ ముసలం

by Shyam |
టీఆర్ఎస్‌లో ‘మార్కెట్’ ముసలం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నామినేటెడ్ పదవులు.. అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టిస్తోంది. ఏండ్ల తరబడి పార్టీ కోసం పనిచేసి.. నేటికీ తగిన గుర్తింపు లభించని నేతలెందరో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇకనైనా తమ వంతు రాకుండా పోతోందా.. అన్న ఆశతో కొట్టామిట్టాడుతున్నారు. రైతు సమన్వయ సమితి సభ్యుల నుంచి నిన్నటి దాకా జరిగిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక వరకు.. తాజాగా మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం అధికార పార్టీ కార్యకర్తలు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల అంశం.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు తీవ్రంగా నడుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లోనైతే.. ఆ పోరు రసవత్తరంగా సాగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జులు పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి.. అమ్యామ్యాలు ముట్టజెప్పినవారికే నామినెటెడ్ పదవులను కట్టాబెట్టారన్న అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దేవరకొండ నియోజకవర్గంలోని మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి.. అధికార టీఆర్ఎస్‌లో తీవ్ర దుమారాన్ని లేపుతోంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మధ్య నువ్వా.. నేనా.. అన్న చందంగా మారింది.

అసలు విషయం ఏంటంటే..

వాస్తవానికి మాల్ మార్కెట్.. దేవరకొండ నియోజకవర్గంలో భాగం. అయితే దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి, మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి, మర్రిగూడ మండలాలు ఈ మాల్ మార్కెట్ కమిటీ పరిధిలోకి వస్తాయి. ప్రతిసారి విడతల వారీగా ఆయా మండలాలకు చెందిన వారికి చైర్మన్ పీఠాన్ని కట్టబెడతారు. అలా ఈసారి చింతపల్లి మండలానికి ఆ చైర్మన్ పీఠం దక్కాల్సి ఉంది. అందుకోసం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్.. ఆ చైర్మన్ పీఠాన్ని చింతపల్లి మండలానికి చెందిన తన అనుచరుడికి కట్టబెట్టేందుకు రంగం సిద్దం చేశారు. అయితే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సైతం ఈసారి తమ నియోజకవర్గానికే చైర్మన్ పీఠం ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. కానీ ముందుగా పెట్టుకున్న అనవాయితీ ప్రకారం.. ఈసారి చింతపల్లి మండలానికి చెందిన వారికి మార్కెట్ కమిటీ పీఠం దక్కాలని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఘంటాపథంగా చెబుతున్నారు.

పార్టీ బలోపేతం కోసం అంటున్న మాజీ ఎమ్మెల్యే..

మాల్ మార్కెట్ కమిటీ ఆనవాయితీ ప్రకారం ఈసారి చింతపల్లి మండలానికే దక్కాల్సి ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నిజానికి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. కానీ రెండోసారి ఎన్నికల్లో ఓటమి చెందడంతో కూసుకుంట్ల అంతర్మథనంలో పడిపోయారు. తన ఓటమిపై పూర్తిస్థాయిలో విశ్లేషించుకున్న అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి నిత్యం ప్రజల్లోనే కన్పిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా నిత్యం ప్రజా సమస్యలు, ప్రజల్లోనే ఉంటూ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారు. ఇటీవల చౌటుప్పల్ మున్సిపాలిటీ కోఆప్షన్ పదవి విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి వచ్చిన స్పందనకు ఒక్కసారిగా ఖంగుతిన్నంత పని అయ్యింది. దీనికి బదులుగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి.. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా టీఆర్ఎస్‌లోకి చేరికలు చేయడంలో సఫలీకృతులయ్యారు. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులకు చైర్మన్ పీఠాన్ని కట్టబెడితే టీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుని బలోపేతం అవుతందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అనుచర గణంతో చెబుతున్న మాట.

చింతపల్లి లేక మర్రిగూడ..

మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం.. టీఆర్ఎస్ నాయకత్వానికే కాదు.. క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. రోటేషన్ పద్దతి ప్రకారం ఈసారి చైర్మన్ పీఠం చింతపల్లి మండలానికి చెందిన వ్యక్తికి దక్కాల్సి ఉండడంతో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తన అనుచరుడికి ఇప్పటికే మాట ఇచ్చారని తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ బలోపేతం కోసం ఈసారి చైర్మన్ పీఠాన్ని మర్రిగూడ మండలానికి త్యాగం చేయాల్సిందేనని కొత్తవాదనను తెర పైకి తెచ్చారు. దీంతో మాల్ చైర్మన్ పీఠంపై సందిగ్ధత నెలకొంది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి.. చైర్మన్ పీఠాన్ని మర్రిగూడ మండలానికి చెందిన తన అనుచరుడికి ఇచ్చేందుకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. మాల్ మార్కెట్ పీఠం అంశం.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య తేలకపోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత వద్దకు చేరినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. మాల్ మార్కెట్ కమిటీ పీఠం విషయంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే ఇంతకీ ఆ కీలక ప్రజాప్రతినిధి ఏం నిర్ణయం తీసుకుంటారు?, మాల్ మార్కెట్ పీఠం ఎవరికీ దక్కనుంది?.. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story