ఫ్లాష్ ఫ్లాష్ : షర్మిల పార్టీలోకి తాటికొండ రాజయ్య?

by Anukaran |
t.-rajaiah
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వైఎస్సార్ తెలంగాణ పార్టీ వైపు చూస్తున్నారా..? హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వచ్చి బ్రదర్ అనిల్‌తో ఆదివారం హఠాత్తుగా సమావేశమైంది అందుకోసమేనా..? దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు వీరాభిమానిగా ఉన్న రాజకీయ ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్టీపీ లాంఛనంగా ఆవిర్భవించిన తర్వాత లోటస్‌పాండ్‌లో జరిగిన చర్చలు సమీప భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీయనున్నాయనే ఊహాగానాలు ఊపందుతున్నాయి. గతంలో షర్మిలతోనూ పలుమార్లు సమావేశమైనట్లు వైఎస్సార్‌టీపీ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు‘ను ప్రవేశపెట్టడం, దళిత సంఘాల నుంచి, దళిత ప్రజా ప్రతినిధుల నుంచి ప్రశంసలు వస్తున్న సమయంలో రాజయ్య లోటస్‌పాండ్‌కు వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇది వ్యక్తిగత సమావేశమే తప్ప రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశం కాదని బ్రదర్ అనిల్‌కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు పేర్కొన్నారు. కానీ వైఎస్సార్టీపీ వర్గాలు మాత్రం వ్యక్తిగత సమావేశంతో మొదలయ్యే ఇలాంటి భేటీలు భవిష్యత్తులో పొలిటికల్ మీటింగ్, ఆ తర్వాత జాయినింగ్ వరకూ దారితీస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా షర్మిలతో టచ్‌లో ఉన్నారని, ఇప్పుడు మాత్రం బ్రదర్ అనిల్‌తో మాత్రమే చర్చలు జరిగాయని వివరించారు.

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజయ్య మధ్య సత్సంబంధాలు లేకపోగా ఒకే పార్టీలో ఉంటూ రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటారన్నది బహిరంగ రహస్యం. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా కడియం శ్రీహరి ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేయడం, ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసిపోయినా మళ్ళీ అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలు రావడం రాజకీయంగా ఒకింత అసంతృప్తి, అసహనం కలిగించాయి. కడియం శ్రీహరికి పార్టీలో ప్రాధాన్యత పెరుగుతున్నదనే భావనతో ఇప్పటి నుంచే భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి మార్గం సుగమం చేసుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed