అసెంబ్లీలో శ్రీధర్ బాబు గరం గరం.. ఆ రైతులకు కన్సెంట్ పరిహారం ఇవ్వండి

by Sridhar Babu |
అసెంబ్లీలో శ్రీధర్ బాబు గరం గరం.. ఆ రైతులకు కన్సెంట్ పరిహారం ఇవ్వండి
X

దిశ, కాటారం : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తిరిగి సభ్యులకు సమాధానం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని, మీరిచ్చిన డైరెక్షన్ సరిగా అమలు కావడం లేదని మంథని శాసన సభ్యులు శ్రీధర్ బాబు స్పీకర్‌కు విన్నవించారు. గోదావరి నదిపై కాళేశ్వరం వద్ద నిర్మించిన ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూములకు కన్సెంట్ అవార్డు ద్వారా పరిహారం అందజేయాలని సోమవారం జీరో అవర్లో శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ సాంకేతిక పరమైన లోపం, ఇంజినీరింగ్ అధికారుల తప్పిదం కారణంగా మంథని, చెన్నూరు నియోజకవర్గాల పరిధిలో రైతులకు చెందిన వేలాది ఎకరాల వ్యవసాయ భూములు వరద నీటిలో ముంపునకు గురవుతున్నాయన్నారు.

గతంలో ఎన్నోమార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ బాధితులకు పరిహారం ఇవ్వలేదని, ఇప్పటికైనా జనరల్ అవార్డు కాకుండా కన్సెంట్ అవార్డు ద్వారా రైతులకు పరిహారం పంపిణీ అందజేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులో వరద నీరు స్టోరేజ్ అయినప్పుడు, లిఫ్ట్ చేసి సిరిపురం బ్యారేజీలో నీరు నిల్వ చేస్తున్నప్పుడు అనేక గ్రామాల్లో రైతులకు చెందిన భూములు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు.

మంథని నియోజకవర్గంలోని సూరారం, బెగులూరు, బ్రాహ్మణ పల్లి, మహాదేవపూర్, అన్నారం, వెంకటాపూర్, ఆరింద మల్లారం, సిరిపురం, పోతారం, ఉప్పట్ల, గుంజపడుగు, సుందిళ్ల గ్రామాలలో ప్రాజెక్టు నీళ్లతో భూములు ముంపునకు గురవుతున్నాయన్నారు. వెంటనే సర్వే చేసి కన్సెంట్ అవార్డు ద్వారా రైతులకు నష్టపరిహారం అందించాలని శ్రీధర్ బాబు కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి సమాధానమిస్తూ మంథని ప్రాంతంలో వరద ముంపునకు గురవుతున్న భూముల విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామన్నారు.

Advertisement

Next Story