సీతక్క ఎప్పుడొస్తవ్.. ఎదురుచూస్తోన్న అక్కడి ప్రజలు

by Sridhar Babu |   ( Updated:2021-08-13 06:54:00.0  )
MLA Seethakka, Pinapaka constituency
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికలకు రెండేండ్ల గడువు ఉండగానే పినపాక నియోజకవర్గ ప్రజలు ములుగు ఎమ్మెల్యే సీతక్క కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఏ ఒక్కరిని కదిలించినా ‘‘సీతక్క ఎప్పుడొస్తావ్’’ అని కలవరిస్తున్నట్లు సమచారం. ఏ గల్లీలో చూసిన సీతక్క పేరు మోతమోగిపోతోందని రాజకీయవర్గాలు, మేధావులు చర్చించుకుంటున్నారు. సీతక్క నియోజకవర్గంలో అడుగుపెడితే పరిస్థితులు ఎలా మారనున్నాయనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. నిజంగా నియోజకవర్గ ప్రజలు సీతక్క కోసం అంత ఎదురుచూస్తున్నారా అంటే అవుననే విడికిడే ఎక్కువగా వినిపిస్తోంది.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై పర్యటన చేశారన్న సమాచారం తెలిసిందే. ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారని విశ్వసనీయ సమాచారం. పొంగులేటి నియోజకవర్గంలో ఎందుకు పర్యటన చేస్తున్నారనే ఆలోచన ప్రజలకు ప్రశ్నార్థకంగా మారింది. అంతేగాకుండా.. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే ఆరోపణలు నియోజకవర్గ ప్రజలకు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే సీతక్కతో కలిసి చక్రం తిప్పనున్నారా? అనే విషయం నియోజకవర్గంలో చిచ్చులేవుతోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోందని ప్రజలల్లో ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రీనివాసరెడ్డికి తీర్థం ఇస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా పొంగులేటి చేతిలోకి వెళ్తుందని పలువురి వాదన. ఇందులో భాగంగానే ములుగు ఎమ్మెల్యే సీతక్క పలుమార్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు కలిశారో అనే విషయం అంతుచిక్కకుండా నియోజకవర్గంలో పలు అనుమానాలకు తావిస్తోంది. పొంగులేటి సీతక్కకు సపోర్ట్ చేస్తున్నారని ప్రజలల్లో విస్తృత చర్చ. ఇదే నిజమైతే సీతక్క పినపాక నియోజకవర్గంలోకి రావడం ఖాయమని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వేగం పెంచిన పొంగులేటి నియోజకవర్గ ప్రజలతో నిత్యం సంభాషణలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావును ప్రజలు నమ్మడం లేదనే గుసగుసలు నియోజకవర్గంలో పలువురి ద్వారా బలంగా వినిపిస్తున్నాయి. రేగాపై ఎందుకు ఇంత వ్యతిరేకత మొదలైందో ప్రశ్నార్థకంగా మారింది. రేగా చుట్టూ ఉన్న కార్యకర్తల వల్లే ఆయనకు రేగాకు చెడ్డపేరు వచ్చిందని పలువురి ఆరోపణ. కొందరు కార్యకర్తలు నిత్యం దందాలకు పాల్పడటం వల్ల రేగాపై నమ్మకం పోయిందని మేధావుల మాటలు. రేగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే, తన చుట్టూ ఉన్న కార్యకర్తలే వెన్నుపోటు పొడుస్తున్నారని నియోజకవర్గంలో హార్ట్ టాపిక్‌గా మారింది. కార్యకర్తలు చేసే దందాలు ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతున్నాయా? తెలియక జరుగుతున్నాయా? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. లేక రేగానే కార్యకర్తలతో చేపిస్తున్నారా? అనేది గందరగోళంగా మారింది. ఏదేమైనా రేగా కెరియర్‌కు మచ్చపడటం చుట్టూ ఉన్న కొంత మంది కార్యకర్తలే అని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి.

నియోజవర్గంలోని కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు సీతక్కతో మంతనాలు జరుపుతున్నారని జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే రేగాను కాదని, సీతక్కకు కలవడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. మొత్తానికి నియోజకవర్గంలో సీతక్క పేరు వినికిడి రోజురోజుకీ మితిమిరిపోతోంది. దీనికి తోడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరితే పినపాక ఎమ్మెల్యే రేగా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. పినపాక నియోజకవర్గ ప్రజల కోసం సీతక్క ఇక్కడికి వస్తుందా? లేదా? రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed