లాక్‌డౌన్ ప్రకటించనున్న లేడి ఎమ్మెల్యే

by srinivas |
లాక్‌డౌన్ ప్రకటించనున్న లేడి ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విజృంభణ నేపథ్యంలో నగరి నియోజకవర్గ పరిధిలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ఎమ్మెల్యే రోజా యోచిస్తున్నారు. ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో నగరి నియోజకవర్గ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు, కావాల్సిన సదుపాయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. అన్‌లాక్ 1 తర్వాత ప్రజల్లో మార్పు వచ్చిందని.. ఎవరూ నిబంధనలను పాటించడం లేదని చెప్పారు. మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తేనే మంచిదని ఎమ్మెల్యేకు సూచించారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఎక్కడా లేని విధంగా ఉచిత పరీక్షలు చేయిస్తున్నాం. ప్రజల నిర్లక్ష్యం వల్లే వైరస్ వ్యాప్తి చెందుతోంది. చెన్నై, ముంబై నుంచి వచ్చిన వారిని రహస్యంగా ఉంచడం వల్లే కేసులు భారీగా నమోదువుతన్నాయి. మరోసారి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించడమే కరోనా కట్టడికి ప్రస్తుతం ఉన్న మార్గం.లాక్‌డౌన్‌పై ప్రజల్లో రెండు రోజుల పాటు అవగాహన కల్పించి..ఆ తర్వాత వారం పాటు లాక్‌డౌన్ విధిస్తామని ఎమ్మెల్యే రోజా వివరించారు.

ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్లినా.. వారి కుటుంబానికి అన్యాయం చేసినట్లుగా భావించాలని ప్రజలకు సూచించారు ఎమ్మెల్యే రోజా. ప్రజలంతా కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నగరి నియోజకవర్గ కోవిడ్ ఇన్‌చార్జి రవి రాజు, తహశీల్దార్లు, కమిషనర్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు పాల్గొన్నారు. కాగా, నగరిలో ఒక్కరోజే 2 పాజిటివ్ కేసులు వచ్చాయి. అంతేకాదు పుత్తూరులో 100, నగరిలో 75 యాక్టివ్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరి పరిధిలో లాక్‌డౌన్ విధించాలని యోచిస్తున్నారు.

Advertisement

Next Story