‘అక్రమ నిర్మాణాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వాటా’

by Anukaran |   ( Updated:2021-08-20 09:16:50.0  )
raja-singh
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల్లో కమీషన్ అందుతోందా.. అందుకే వాటిని కూల్చకుండా వదిలి వేస్తున్నారా..? అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జీహెచ్ఎంసీ కమిషనర్‌ను సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు అక్రమ నిర్మాణాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోరని.. అదే సాధారణ ప్రజలను మాత్రం వేధింపులకు గురి చేసి కూల్చివేస్తారా అంటూ నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. గోషామహల్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని, బిల్డర్లు అధికారులకు లంచం ఇచ్చి పెద్ద పెద్ద భవనాలు నిర్మించి కోట్లు సంపాదిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా వచ్చిన లంచాల నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు లంచాలు రావడంతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు అంటూ రాజాసింగ్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు పని చేయకపోతే సస్పెండ్ చేయండి.. కమిషనర్‌గా మీ పైన బాధ్యత ఉందంటూ గుర్తు చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌ను అనుసరించి ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన కొంత స్థలాన్ని ఓ టీఆర్ఎస్ నాయకుడు ఆక్రమించుకున్నాడని.. ఆ స్థలంలో నిర్మాణం చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పూజారి శంకర్ దాస్ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్రమంగా గుడి స్థలంలో నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలని ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్‌ కమిషనర్‌ను డిమాండ్ చేశారు.

Advertisement

Next Story