ఆందోళన వద్దు.. మేమున్నాం : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

by Shyam |
ఆందోళన వద్దు.. మేమున్నాం : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
X

దిశ, వరంగల్: వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లే విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, మీకోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో శనివారం వరంగల్ రైల్వే స్టేషన్‌కు 600 మంది కార్మికులు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఎమ్మెల్యే నరేందర్ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి వరంగల్ బస్టాండ్‌కు తీసుకువచ్చారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేయించారు.‌ అనంతరం కలెక్టర్‌కు ఫోన్ చేసి వలస కార్మికుల పూర్తి డేటా సేకరించి, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌ తహసీల్దార్లతో మాట్లాడి కూలీల వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటోందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. రెండు, మూడు రోజుల్లో వలస కార్మికుల పూర్తి వివరాలు సేకరించి, వారిని స్వస్థలాలకు పంపిస్తామన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.

Tags: lockdown, mla nannapaneni narender, migrant labours, central govt permission

Advertisement

Next Story

Most Viewed