ద‌ళితుల ఆత్మగౌర‌వంతో కేసీఆర్ ఆట‌.. ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆగ్రహం

by Shyam |
MLA Jagga Reddy
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ద‌ళితుల‌ను మ‌రోసారి మోసం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ తీసుకొచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సోమ‌వారం వరంగల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని 53వ డివిజ‌న్‌లో ‘ద‌ళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జ‌గ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటు అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ కో-ఆర్డినేటర్ బి.అయోధ్య రెడ్డిలు హాజ‌ర‌య్యారు. హ‌న్మకొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేంద‌ర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ.. దళిత బంధు పథ‌కాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని, అలాగే మిగ‌తా వ‌ర్గాల‌కు కూడా ఆయా బంధుల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని గిరిజన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ద‌ళితుల ఆత్మ గౌరవంతో, మనోభావాల‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆట ఆడుకుంటున్నారని దుయ్యబ‌ట్టారు. ద‌ళితుల‌ను అనేకసార్లు అవ‌మానిస్తూ వ‌చ్చారని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా వ్యవ‌హ‌రించాల్సిన అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది టీఆర్ఎస్‌, బీజేపీ నాయ‌కుల‌కు పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. అలాంటి పోలీసుల పేర్లు రాసిపెట్టుకోవాలని కాంగ్రెస్ నేత‌ల‌కు సూచించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు ఆ అధికారుల‌కు బుద్ధి చెబుదామంటూ వ్యాఖ్యానించారు.

పేద‌ల భూములు లాక్కుంటున్నరు : ఎమ్మెల్యే సీతక్క

కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మంది పేదలకు భూమి పంచిందని ఎమ్మెల్యే సీత‌క్క గుర్తుచేశారు. నేడు కేసీఆర్ ప్రభుత్వం హరితహారం, హరితవనం, కలెక్టర్ కార్యాలయాలు, పరిశ్రమల పేరుతో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను నష్టపరిహారం కూడా చెల్లించకుండా లాక్కుంటున్నార‌ని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీ స‌భ్యుడు బత్తిని శ్రీనివాస్ రావు, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, వరంగల్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story