గండ్ర గాండ్రింపు.. అడుగు పెడితే అంతే అంటూ ఆమెకు బెదిరింపులు?

by Anukaran |   ( Updated:2021-07-11 11:08:08.0  )
MLA Gandra Jakku Sriharshini
X

దిశ, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లి జిల్లా జ‌డ్పీ చైర్‌ప‌ర్సన్ జ‌క్కుల శ్రీహ‌ర్షిణి రాజకీయ అణిచివేత‌కు గుర‌వుతున్నారా..? భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి ఆమెకు క‌నీసం ఎంట్రీ కూడా ఉండ‌టం లేదా..? అంటే అవుననే సమాధానం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి వస్తోంది. జ‌డ్పీచైర్‌ప‌ర్సన్‌గా కీల‌క ప‌ద‌విలో ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే శంకుస్థాప‌నలు, ప్రారంభోత్సవాలు, ఇత‌ర‌త్రా ముఖ్యమైన నిర్ణయాల్లో ఆమెకు క‌నీసం గౌర‌వం ద‌క్కడం లేదన్నది జగమెరిగిన సత్యమేనట. అధికారులంతా ఎమ్మెల్యే గండ్ర క‌నుస‌న్నల్లోనే ప‌నిచేస్తుండ‌టంతో భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వర్గంలో జ‌రిగే ఏ కార్యక్రమానికి ఆమెకు స‌మాచారం, ఆహ్వానం ఉండ‌టం లేద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు, జ‌డ్పీ పాల‌క వ‌ర్గం స‌భ్యులే చ‌ర్చించుకుంటున్నారు. ఆమెను ఇంత దారుణంగా అవ‌మానించ‌డం స‌బ‌బు కాద‌ని పేర్కొంటున్నారు.

ఉన్నత విద్యన‌భ్యసించి, ప్రజాసేవ చేసేందుకు అవ‌కాశం ల‌భించినా.. ద‌ళిత మ‌హిళా ప్రజాప్రతినిధిని అవ‌మానిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా అధిష్ఠానం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోపనలు పార్టీ కేడ‌ర్‌లోనూ వినిపిస్తున్నాయి. జ‌డ్పీ చైర్‌ప‌ర్సన్‌గా జిల్లాలో ఎలాంటి రాజ‌కీయ ఉనికి లేకపోవ‌డంతో ప‌ద‌వి ఉన్నా.. లేకున్నా ఒక్కటే అని జ‌డ్పీ చైర్‌ప‌ర్సన్ త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నారంటే ఆమె ఎంత నిరుత్సాహంలో ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

అడుగుపెడితే ప‌ద‌వీగండం..

జ‌డ్పీ చైర్‌ప‌ర్సన్ జ‌క్కుల శ్రీహ‌ర్షిణి మంథ‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని విలీన మండ‌లాలైన కాటారం, మహదేవ్‌పుర్‌, మహ‌ముత్తారం, మల్హర్ మండ‌లాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్సవాల‌కు మాత్రమే హాజ‌ర‌వుతున్నారు. ఈ ప్రాంతాల్లోనే ప‌ర్యటిస్తూ ఉనికిని కాపాడుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు. అయితే జ‌డ్పీ చైర్‌ప‌ర్సన్‌గా ప‌లు కీల‌క నిర్ణయాల‌తో అభివృద్ధిలో త‌న‌దైన ముద్ర చూపాల‌నే కుతూహ‌లంతో ఉన్నా.. రాజ‌కీయ బెదిరింపుల‌తో నాలుగు మండ‌లాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

నా అనుమ‌తి లేకుండా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించొద్దు.. ఏదైనా ఉంటే మీ ప‌రిధిలో చేసుకోండి అంటూ గండ్ర హెచ్చరించిన‌ట్లుగా టీఆర్ఎస్ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి ఆమె అడుగు పెడితే ప‌ద‌వి ఊడుతుంద‌నే బెదిరింపుల‌తో కేవ‌లం స‌మీక్షల‌కు త‌ప్ప.. భూపాల‌ప‌ల్లి జిల్లా కేంద్రం మొహం చూడ‌టానికి కూడా జ‌డ్పీ చైర్‌ప‌ర్సన్ ఇష్టప‌డ‌టం లేదని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు.

ఇప్పటివరకు భూపాలపల్లి, రేగొండ, గ‌ణ‌పురం, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమ‌ట్ల మండలాల్లో ఆమె పర్యటించిన దాఖలాలు లేక‌పోవ‌డం ఇందుకు నిద‌ర్శన‌మ‌ని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటించరాదంటూ భూపాలపల్లి శాసన సభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి.. జడ్పీ చైర్ పర్సన్‌కు హుకుం జారీ చేయ‌డం ఇందుకు కార‌ణ‌మ‌న్న అభిప్రాయాన్ని టీఆర్ఎస్ ముఖ్య నేత‌లు సైతం అంగీక‌రిస్తున్నారు.

ద‌ళిత మ‌హిళా ప్రజాప్రతినిధి అని చిన్నచూపు..!

భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ఏ అభివృద్ధి అంశంతో ఆమెకు సంబంధం లేద‌న్నట్లుగా అధికారులు సైతం వ్యవ‌హ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. క‌నీసం ప్రోటోకాల్ ప్రకారం కూడా ఆహ్వానాలు అంద‌డం లేద‌నే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆమెకు ఆహ్వానాలు అంద‌క‌పోవ‌డం వెనుక ఎమ్మెల్యే గండ్ర రాజ‌కీయ ఒత్తిళ్లే కార‌ణ‌మ‌ని టీఆర్ఎస్ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతోంది. కేవ‌లం ద‌ళిత మ‌హిళా ప్రజాప్రతినిధి ఎదుగుద‌ల‌ను ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారంటూ పార్టీ కార్యక‌ర్తలు, జిల్లా ప్రజానీకంలో బలమైన అభిప్రాయం ఏర్పడడం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story