అధికారుల పాత్ర ఎంతో తేల్చాలి -గద్దె రామ్మోహన్ 

by srinivas |
అధికారుల పాత్ర ఎంతో తేల్చాలి -గద్దె రామ్మోహన్ 
X

దిశ, వెబ్ డెస్క్: స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో 10 మంది మరణించడం అత్యంత భాధాకరమని ఆ విషయంలో రాష్ట్రమంతా ఆవేదనకు గురయిందని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వాపోయారు. జరిగిన ప్రమాదంలో రమేష్ బాబు, సదరు ఆసుపత్రి ప్రమేయం ఎంత ఉందో, అధికారుల పాత్ర ఎంత ఉందో, నిజానిజాలు తేల్చకుండా ఒక వ్యక్తినే లక్ష్యంగా చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు.

సోమవారం విజయవాడ అశోక్ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ… కోవిడ్ చికిత్స కోసం ప్రభుత్వమే ప్రవేట్ ఆసుపత్రులను ఆశ్రయించిందని, వైద్యం చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందన్నారు. ప్రభుత్వం గతంలో క్వారెంటైన్ కేంద్రంగా ఉపయోగించిన స్వర్ణాప్యాలెస్ నే డాక్టర్ రమేష్ బాబు కోవిడ్ కేంద్రంగా ఉపయోగించారన్నారు.

ఫైర్ అనుమతులు, ఇతర అనుమతులు లేనప్పుడు ప్రభుత్వం దాన్ని క్వారంటైన్ కేంద్రంగా ఎలా ఉపయోగించిందని ప్రశ్నించారు. ఈ ఘటనలో నిష్పక్షపాతంగా వాస్తవాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రంగా ఉన్నప్పుడే అక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ప్రభుత్వం భాధ్యత తీసుకునేదా అని గద్దె రామ్మోహన్ నిలదీశారు.

అధికారులు చేసిన తప్పిదానికి రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఎలా జవాబుదారీ అవుతుందో చెప్పాలన్నారు. వైద్యం అనే పవిత్రమైన వృత్తికి కులాన్ని, మతాన్ని అంటగడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జరిగిన సంఘటనపై ఎవరు బాధ్యులో నిష్పక్షపాతంగా విచారించి, చర్యలు తీసుకోవాలని గద్దె రామమోహన్ ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed