మధుయాష్కీ @దొంగ సర్టిఫికెట్లు, అక్రమ వీసాలు!

by Shyam |   ( Updated:2021-07-08 12:23:39.0  )
maduyashki-goud
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ మధుయాష్కీపై ఎల్బీనగర్ అధికార పార్టీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. మధుయాష్కీ గౌడ్ దొంగ చదువు, నకిలీ సర్టిఫికెట్స్ గురించి అందరికీ తెలిసిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల చిట్టా చాలా ఉందని, అందరి బండారం బయట పెడతామని హెచ్చరించారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ తనపై ప్రయోగించిన పరుష పదజాలాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో తనకు పదవులు రావడానికి అంకిత భావంతో పని చేయడమే అని గుర్తుచేశారు. 36 ఏళ్లు కాంగ్రెస్‌లో పనిచేశానని, కార్పొరేటర్ అయిన తర్వాత 22 ఏళ్లకు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని తెలిపారు. మధుయాష్కీ అమెరికా నుంచి 2003లో రాగానే కాంగ్రెస్‌లో తక్కువ సమయానికే టికెట్ వచ్చిందన్నారు. ఆయన అమెరికాలో ఎన్ని నేరాలు చేశారో నా దగ్గర చిట్టా ఉందని, సమయం వచ్చినపుడు చెబుతానన్నారు.దొంగ సర్టిఫికెట్‌లతో అమెరికా కు జనాలను పంపే ముఠాను నడిపింది యాష్కీ కాదా..? అని ప్రశ్నించారు.

అమెరికాలో అటార్నీ పరీక్షలు ఆరుసార్లు రాసి ఫెయిలయ్యారు. కానీ అటార్నీ అని చెప్పుకుంటాడని దుయ్యబట్టారు. త్వరలోనే యాష్కీ జైలుకు పోక తప్పదని జోస్యం చెప్పారు. మధుయాష్కీ చేసిన నేరాలపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని, అమెరికాలో ఆరు నెలలు.. ఇక్కడ ఆరు నెలలు ఉండే యాష్కీ నా గురించి మాట్లాడుతారా? అని అన్నారు. యాష్కీ లాగా నేను మాట్లాడగలను.. సంస్కారం అడ్డువస్తుందని తెలిపారు. ఎప్పటికైనా నేరాలు నిరూపించి యాష్కీని జైలుకు పంపి తీరుతానని స్పష్టంచేశారు. న్యూయార్క్ ఫెడరల్ కోర్ట్‌లో జైలు శిక్షను తప్పించుకునేందుకు అక్కడ కాళ్ల బేరానికి పాల్పడ్డాడని, తనకు కాంగ్రెస్ నుంచి టికెట్ రాకుండా మధుయాష్కీ అడ్డుపడ్డాడని ఆరోపించారు. ఆయన లాంటి నేతలు కాంగ్రెస్‌ను బ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ఏ సెగ్మెంట్ లోనైనా యాష్కీతో చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు దేవిరెడ్డి. నకిలీ వీసాలతో అమాయకులను అమెరికాకు పంపిన యాష్కీని కటకటాల పాలు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story