టీకాల కొరత.. రెండో డోసులో వేరే టీకా వేసుకోవచ్చా..

by Anukaran |   ( Updated:2021-06-02 11:58:48.0  )
టీకాల కొరత.. రెండో డోసులో వేరే టీకా వేసుకోవచ్చా..
X

దిశ, ఫీచర్స్ : ఫస్ట్ డోస్‌లో కొవిషీల్డ్ తీసుకుని, రెండోసారి కొవాగ్జిన్ టీకా వేసుకుంటే ఏమవుతుంది? అనే సందేహం ఎంతోమందిలో తలెత్తింది. పరిశోధకులు కూడా ఇలానే ఆలోచించి వెంటనే ప్రయోగాలు మొదలుపెడితే ఊహించని ఫలితాలు వచ్చాయి. అయితే ఇలా ‘మిక్స్‌డ్’ వ్యాక్సిన్స్ తీసుకోవడం శ్రేయస్కరమేనా? దానివల్ల ప్రయోజనం ఎంత? ఎలాంటి రక్షణ అందిస్తున్నాయి? ఏ దేశాల్లో ‘మిక్స్ అండ్ మ్యాచ్’ టీకాలు ఇస్తున్నారు? వంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..

ప్రపంచవ్యాప్తంగా ‘వ్యాక్సినేషన్ డ్రైవ్’ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రజల భద్రతా ప్రమాణాల దృష్ట్యా మొదటి డోస్ తర్వాత నిర్ణీత సమయంలోగా సెకండ్ డోస్‌ ఇవ్వాలి ఉంటుంది. కానీ చాలా దేశాలు ‘టీకాల’ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ‘మిక్స్ అండ్ మ్యాచ్’ విధానానికి తెరలేపాయి. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మొదటి మోతాదుగా తీసుకున్నవాళ్లు, రెండో డోస్‌గా కొవాగ్జిన్ లేదా ఇతర వ్యాక్సిన్ బూస్టర్‌లు తీసుకోవడమే ఈ కొత్త విధానం కాగా, దీనిపై అనేక అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇక స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ‘మిక్స్ అండ్ మ్యాచ్’ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చినట్లు తాజాగా వెల్లడైంది. అంతేకాదు ఒకే టీకాకు చెందిన రెండు డోసుల కంటే, మిక్స్‌డ్ టీకాలు తీసుకోవడం వల్ల యాంటీబాడీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని సూచిస్తున్నాయి. ఆస్ట్రేలియా డ్రగ్ రెగ్యులేటర్, ది థెరపిటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్.. మిక్స్‌డ్ కొవిడ్ -19 టీకా షెడ్యూల్‌ను ఇంకా ఆమోదించకపోగా, కొన్ని దేశాలు ఇప్పటికే అమలు చేస్తుండటం విశేషం.

ఉపయోగమేంటి.?

రెండు భిన్నమైన కొవిడ్ -19 వ్యాక్సిన్లను నిరభ్యంతరంగా కలపొచ్చు. దీనివల్ల నష్టమేమీ లేదని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఒక టీకా కొరత ఉంటే, సరఫరా కోసం వేచిచూస్తూ మొత్తం ప్రోగ్రామ్‌ను నిలిపివేసే బదులు, వేరే వ్యాక్సిన్‌తో కంప్లీట్ చేయొచ్చు. అంతేకాదు డోస్ టైమ్ లిమిట్ మించిపోయేవాళ్లకు కూడా ఈ పద్ధతి శ్రేయస్కరమే. కొవిడ్ వేరియంట్‌‌పై ఒక టీకా మరొకదాని కంటే తక్కువ ప్రభావాన్ని చూపెడితే.. మిక్స్ అండ్ మ్యాచ్ షెడ్యూల్‌లో మరింత ప్రభావవంతమైన వ్యాక్సిన్‌తో బూస్టర్ పొందే అవకాశం కూడా ఉంది. ఇక కొందరిలో ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్‌ వల్ల రక్తం గడ్డకట్టడం/రక్తస్రావం(చాలా అరుదైన దుష్ప్రభావం) కావడంతో కొన్ని దేశాలు ఇప్పటికే మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్ షెడ్యూల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. ఐరోపాలోని అనేక దేశాలు.. ఫస్ట్ డోస్‌గా ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న వారికి రెండోసారి ప్రత్యామ్నాయ వ్యాక్సిన్‌ను స్వీకరించాలని సలహా ఇస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే, డెన్మార్క్‌ కూడా మిశ్రమ టీకా షెడ్యూల్స్‌కు సంబంధించి సలహాలు ఇస్తున్నాయి.

శ్రేయస్కరమేనా?

గత నెల లాన్సెట్‌లో ప్రచురించిన యూకే మిక్స్ అండ్ మ్యాచ్ అధ్యయనంలో.. 50 ఏళ్లు పైబడిన 830 మంది పెద్దలు మొదట ఫైజర్ లేదా ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ తీసుకుని, రెండో డోస్‌లో ఇతర వ్యాక్సిన్లు పొందారు. రెండో డోస్ తర్వాత చలి, అలసట, జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పి, అనారోగ్యం, కండరాల నొప్పి వంటి తేలికపాటి నుంచి మిత లక్షణాలతో బాధపడ్డారే తప్ప ఇతరత్రా సమస్యలేవీ ఉత్పన్నం కాలేదు. స్పెయిన్‌లో జరిగిన మరో అధ్యయనంలో ఇలాంటి ఫలితాలే వచ్చాయి. 14 రోజుల పర్యవేక్షణలో ప్రజలు అత్యధిక యాంటీబాడీ ప్రతిస్పందనను కలిగి ఉన్నారని స్పానిష్ అధ్యయనం కనుగొంది. ఈ ప్రతిరోధకాలు ప్రయోగశాల పరీక్షల్లో కరోనా వైరస్‌ను గుర్తించి, క్రియారహితం చేయగలిగాయి.

అయితే కొవిడ్ -19ను నివారించడంలో మిక్స్ అండ్ మ్యాచ్ షెడ్యూల్స్ ఎంత ప్రభావవంతంగా ఉన్నాయనే అంశంపై ఇంకా పూర్తి డేటా అందుబాటులో లేదు. మొదటి, రెండో మోతాదులో ఒకే వ్యాక్సిన్‌ను ఉపయోగించే అధ్యయనాలతో పోలిస్తే, మిక్స్‌డ్ వ్యాక్సిన్ రోగనిరోధక ప్రతిస్పందన సారూప్యంగా లేదా మరింత మెరుగ్గా ఉన్నందున అవి బాగా పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. యూకేలో మోడెర్నా, నోవావాక్స్ వ్యాక్సిన్లతో మిశ్రమ వ్యాక్సిన్ల పనితీరును అంచనా వేయడానికి మరిన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ రెండూ ఆస్ట్రేలియాతో సరఫరా ఒప్పందాలను కలిగి ఉన్నాయి.

అనుసరిస్తున్న దేశాలేవి?

కెనడా : ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ తర్వాత ఫైజర్ లేదా మోడెర్నా రెండో షాట్ పొందడానికి కెనడా సిఫారసు చేస్తోంది. టీకా తీసుకోవడంలో జాప్యం వద్దని, రెండో డోస్ ఏదైనా తీసుకోవచ్చని ఆ దేశ జాతీయ సలహా కమిటీ ప్రజలకు సూచిస్తోంది.
ఫిన్‌లాండ్ : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్, ఫిన్‌లాండ్ ప్రకారం.. మొదటి డోస్‌గా ఆస్ట్రాజెనకా పొందిన 65 సంవత్సరాల కంటే తక్కువ వయస్కులు రెండో షాట్‌గా వేరే టీకా పొందవచ్చు.
ఫ్రాన్స్ : 55 ఏళ్లలోపు వ్యక్తులు మొదట ఆస్ట్రాజెనకా, ఆ తర్వాత మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను స్వీకరించాలని ఫ్రాన్స్ ఉన్నత ఆరోగ్య సలహా సంస్థ ఇటీవలే సిఫారసు చేసింది.
నార్వే : ఏప్రిల్ 23న ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ మోతాదు పొందిన వారికి రెండో మోతాదుగా ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్‌ ఇస్తామని నార్వే తెలిపింది.
రష్యా : ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎథికల్ కమిటీ మిశ్రమ టీకాలపై మరింత డేటాను కోరగా.. ‘ఆస్ట్రాజెనకా, స్పుత్నిక్ వీ’ వ్యాక్సిన్లను కలిపే క్లినికల్ ట్రయల్స్‌‌కు ఆమోదం నిలిపివేసింది.
దక్షిణ కొరియా : ఫైజర్‌, ఇతర వ్యాక్సిన్లతో ఆస్ట్రాజెనకా మోతాదులను కలిపే మిక్స్-అండ్-మ్యాచ్ ట్రయల్స్ నిర్వహిస్తామని మే 20న తెలిపింది.
యూకే : అరుదైన సందర్భాల్లో ప్రజలకు రెండో మోతాదుకు వేరే వ్యాక్సిన్ ఇవ్వడానికి వీలు కల్పిస్తున్నట్టు జనవరిలో తెలిపిన బ్రిటన్.. మొదటి టీకా స్టాక్ లేకపోతేనే ఈ అవకాశమని స్పష్టం చేసింది. ఇక కెనడా, స్వీడన్‌లు కూడా ఇదే విధానానికి ఓకే చెప్పాయి.

భారత్‌లోనూ ట్రయల్స్..

టీకాల కొరత ఉన్న భారత్ వంటి దేశాలకు ఈ ట్రయల్స్ మేలు చేస్తాయి. దీనివల్ల అందుబాటులో ఏ వ్యాక్సిన్ అయినా ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది. రెగ్యులేటరీ ఆదేశాల ప్రకారం ఇండియాలో ఇప్పటివరకు మనం ఒకే వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండు డోసులను తీసుకుంటున్నాం. ఇలాంటి తరుణంలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ అవసరముంది. కాబట్టి మిక్స్‌ అండ్ మ్యాచ్ ట్రయల్స్ మనదేశంలో చేసినా, ఇతర దేశాల్లో చేసినా ఒకటే. అయితే కొవిడ్ -19 వ్యాక్సిన్ల మిశ్రమ ట్రయల్స్ గురించి నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్‌లో చర్చించిన కొవిడ్ -19 వర్కింగ్ గ్రూప్, ఎన్‌టీఐజీ, కొవిడ్ -19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఈజీవీఏసీ).. మెరుగైన రక్షణనిచ్చే వ్యాక్సిన్ల కలయిక కోసం ఇక్కడ కూడా ట్రయల్స్ చేస్తామని వెల్లడించాయి.
– డాక్టర్ వి రవి, వైరాలజిస్ట్, టీకాలపై బయోటెక్నాలజీ నిపుణుల కమిటీ సభ్యుడు

Advertisement

Next Story