కోటి మార్క్‌ను చేరుకున్న ‘మిత్రోన్’

by Harish |
కోటి మార్క్‌ను చేరుకున్న ‘మిత్రోన్’
X

దిశ, వెబ్‌డెస్క్ : చైనా యాప్ టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన ‘మిత్రోన్‌ యాప్‌’ యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ యాప్‌‌నకు యాంటీ చైనా సెంటిమెంట్ బాగా కలిసిసొచ్చింది. ఈ క్రమంలో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి మిత్రోన్‌ యాప్‌ను కేవలం రెండు నెలల్లోనే కోటి మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

యాప్ బ్రెయిన్ లిస్ట్ ప్రకారం.. మిత్రోన్ యాప్‌ను ఏప్రిల్ 17న గూగుల్ ప్లే స్టోర్‌లో లాంచ్ చేశారు. కాగా కేవలం ఏడు రోజుల్లోనే లక్ష మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత గూగుల్ నిబంధనలు పాటించడం లేదనే కారణంతో.. జూన్ 2న ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తీసేసినా.. అన్ని నిబంధనలతో మళ్లీ జూన్ 5న గూగుల్ ప్లే స్టోర్‌లో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 22న ఈ యాప్ అధికారికంగా కోటి ‌డౌన్‌‌‌లోడ్లు సాధించింది. అంతేకాకుండా ప్లేస్టోర్‌లో 4.5 రేటింగ్‌ ఉండటం విశేషం.

ఇప్పటికే మిత్రోన్‌కు పోటీగా దేశీ యాప్ ‘చింగారీ’ కూడా వచ్చేసింది. ఈ యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో దూసుకుపోతుండటం గమనార్హం. తాజాగా కేవలం 72 గంటల్లోనే 5 లక్షల డౌన్‌లోడ్లు సాధించింది. కాగా, జీ5 నుంచి కూడా త్వరలోనే టిక్‌టాక్ తరహా యాప్ రాబోతుందని ఆ సంస్థ ప్రకటించింది.

Advertisement

Next Story