పాకిస్థాన్ ‘టిక్‌టిక్’కు కాపీగా మిత్రోన్ యాప్!

by Harish |
పాకిస్థాన్ ‘టిక్‌టిక్’కు కాపీగా మిత్రోన్ యాప్!
X

చైనా యాప్ ‘టిక్‌టాక్‌’కు పోటీగా భారతదేశంలో విడుదలైన మిత్రోన్ యాప్.. రెండు రోజుల్లోనే 5 మిలియన్ డౌన్‌లోడ్స్ పూర్తి చేసుకొని రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఐఐటీ రూర్కీ విద్యార్థి శివాంక్ అగర్వాల్ రూపొందించినట్లు చెబుతున్న ఈ యాప్.. పాకిస్థాన్ దేశానికి చెందిన టిక్‌టిక్ యాప్‌నకు కాపీ అని తేలింది. ఈ టిక్ టిక్ యాప్‌ను క్యూబాక్సస్ సంస్థ అభివృద్ధి చేసి, దీని సోర్స్ కోడ్‌ను కోడ్ క్యానయాన్ వెబ్‌సైట్‌‌‌లో అమ్మకానికి పెట్టింది. కాగా ఆ కోడ్‌ను కొనుక్కుని కొన్ని మార్పులతో మిత్రోన్ యాప్ తయారుచేసినట్లు తెలుస్తోంది. రెండు యాప్‌లలోని కోడ్‌ను పోల్చి చూస్తే దాదాపు ఒకేలా ఉన్నట్లు తేలింది. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల టిక్‌టిక్ సోర్సింగ్ కూడా ఉపయోగించినట్లు కనిపించింది.

దీని గురించి క్యూబాక్సస్ సంస్థ సీఈఓ ఇర్ఫాన్ షేక్ స్పందించారు. ఏప్రిల్ 1, 2020న 34 డాలర్లకు కోడ్ క్యానయాన్ వెబ్‌సైట్ నుంచి కోడ్‌ని కొన్నట్లు తమ దగ్గర ఇన్వాయిస్ కూడా ఉందని ఇర్ఫాన్ అన్నారు. డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి కోడ్‌ను వాడుకోవడంలో ఎలాంటి తప్పులేదని, కాకపోతే మిత్రోన్ యాప్ ఇండియా తెలివితోనే తయారైందని, తామే స్వయంగా తయారు చేసినట్లు మీడియాలో చెప్పుకోవడం సబబు కాదని ఇర్ఫాన్ చెబుతున్నారు. తమ కోడ్‌కు పేరు, బ్రాండ్, స్ప్లాష్ స్క్రీన్ ఇంకా మరికొన్ని చిన్నచిన్న మార్పులు చేసి భారత్‌లో తయారైన యాప్ అనడం ఏ మాత్రం బాగోలేదని ఇర్ఫాన్ విమర్శించారు. కనీసం యాప్ కోడ్‌లో ఉన్న బగ్స్‌ను కూడా క్లియర్ చేయకుండా నేరుగా ప్లేస్టోర్‌లో పెట్టేశాడని, అందులో ఉన్న బగ్స్ వల్ల వ్యక్తిగత సమాచారం బయటికి లీకయ్యే ప్రమాదం ఉందని కూడా ఇర్ఫాన్ హెచ్చరించారు.

Advertisement

Next Story