గురి తప్పిన సీఎం బాణం.. మంత్రి మల్లారెడ్డికి ఉద్వాసన తప్పదా..?

by Anukaran |   ( Updated:2021-05-06 10:30:20.0  )
MallaReddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం బాణం గురి తప్పిందా అనే చర్చ మొదలైంది. మాజీ మంత్రి ఈటల టార్గెట్​గా సంధించిన అసైన్డ్​ భూ వ్యవహారం ఇప్పుడు సీఎం కొడుకుతో పాటుగా అనుంగ అనుచరులు, పలువురు మంత్రుల వైపు దూసుకుపోతోంది. మరోవైపు ఎంపీ రేవంత్​రెడ్డి రాజకీయ కోణంలో ఈటల వ్యవహారాన్ని పక్కకు పెట్టి భూ కబ్జా అంశాన్ని తీవ్రస్థాయిలో వేడెక్కిస్తున్నారు. దేవరయాంజల్​ భూముల అంశాన్ని అధికార పార్టీ అధికారిక పత్రికలో ప్రచురించిన సర్వే నెంబర్లు, భూ కథనాలను సాక్షిగా చూపిస్తూ వాటిపై విమర్శలకు పదును పెంచారు. ఏకంగా నిజనిర్ధారణ కమిటీ పేరుతో రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో దేవరయాంజల్​ భూముల్లో అడుగు పెట్టారు. అయితే ప్రభుత్వం వ్యూహాత్మకంగా బయటపెట్టిన సర్వే నెంబర్లు మంత్రివర్గానికి తలనొప్పిగా మారుతున్నాయి.

ఈటలపై గురి.. మంత్రులకు తలనొప్పి

మొన్నటి వరకు కేబినెట్​లో ఉన్న ఈటల లక్ష్యంగా భూ కబ్జా వ్యవహారం బయటకు తీసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్​లో దేవరయాంజల్​ భూముల్లో కూడా ఈటల కబ్జా చేసినట్లు గులాబీ పత్రిక నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది. ఇదే కొత్త చిక్కులు తీసుకువచ్చింది. దేవరయాంజల్​ భూముల అంశంపై చాలా రోజుల నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎంపీ రేవంత్​రెడ్డికి ఆధారాలు చిక్కినట్లు అయింది. దీంతో చాలా మేరకు దేవరయాంజల్​ భూముల వివరాలను బయటకు తీశారు. ఇక్కడ మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి అనుచరులు, బంధువులు, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్​రావుకు భూములున్నట్లు ధృవీకరణ పత్రాలను బయట పడ్డాయి.

అంతేకాకుండా టీఆర్ఎస్​ నేతలు నూతనంగా నిర్మాణాలు చేస్తున్న నిర్మాణాలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఒకవిధంగా ఈటల టార్గెట్​గా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అవన్నీ ప్రతిపక్షాలకు అవకాశంగా చిక్కాయి. మరోవైపు వీటిపై మంత్రి మల్లారెడ్డి మొదటిరోజే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎంపీ రేవంత్​రెడ్డి సవాల్​ చేశారు. బహిరంగంగా విచారణకు రావాలని, దీనిపై ఆధారాలున్నాయంటూ పలు పత్రాలు చూపించడంతో… ఒక విధంగా మంత్రి మల్లారెడ్డి వెనక్కి తగ్గినట్లుగా అయింది.

ఇప్పుడెలా..?

ప్రస్తుతం దేవరయాంజల్​ భూములన్నీ అధికార పార్టీ నేతల చేతుల్లో కబ్జాకు గురైనట్లు రాష్ట్రంలో చర్చగా మారింది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం తరుపున చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు కూడా దొరకడం లేదు. వివరణ ఇచ్చుకునే ప్రయత్నాలు కూడా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో అసైన్డ్​ భూములు, దేవాలయాల భూములు కబ్జా చేస్తే సీఎంకు నచ్చితే ఒక విధంగా.. నచ్చకుంటే మరో విధంగా ఉంటారని ఎత్తి చూపిస్తున్నారు. దీనికి దేవరయాంజల్ భూములనే ఉదాహరణగా చూపిస్తున్నారు. దీంతో ఎలా సమర్ధించుకోవాలో తెలియక కష్టాలు పడుతున్నారు. సమర్థించుకునేందుకు అధికార పార్టీ నేతల దగ్గర ఆధారాలు కూడా దొరకడం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్​కు గెజిట్​ లాంటి పత్రికలోనే ఈ వివరాలు ప్రచురించడంతో ఎలా తప్పించుకోవాలనే సాకు కోసం వెతుకుతున్నారు.

విచారణ కమిటీకి కూడా చిక్కులు

మరోవైపు ఈ వ్యవహారం అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. దేవరయాంజల్​ భూములపై సీనియర్​ ఐఏఎస్​ అధికారి రఘునందన్​రావు టీమ్​ లీడర్​గా నలుగురు ఐఏఎస్​లతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ విచారణలో దేవరయాంజల్​ భూములు కబ్జాకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. కానీ ఎక్కడ… ఎవరెవరు అనే వివరాలను బయట పెట్టే సాహసం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. విచారణ కమిటీ గుర్తించిన ప్రకారం చాలాచోట్ల షెడ్లు, ఫంక్షన్​హాళ్లు, ఫాంహౌస్​లు నిర్మాణం చేస్తున్నట్లు వెల్లడైంది. కానీ ఇవన్నీ అధికార పార్టీ లీడర్లవేనని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఈటల రాజేందర్​ భూములపై ఎలా నివేదిక ఇవ్వాలనేది ప్రశ్నార్థకంగా మారింది.

కేవలం ఈటల మీద ఫోకస్​ పెట్టి ఒక్కటే నివేదిక ఇస్తే… మిగిలిన భూమి ఎలా అన్నది ఎటూ తేలని మిలియన్​ డాలర్ల ప్రశ్న. ఒకవేళ ఆక్రమణదారులందరి పేర్లతో విచారణ నివేదిక ఇస్తే.. ప్రభుత్వాగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. దీంతో సర్వే చేస్తున్నా… ఐఏఎస్​ అధికారుల్లో తెలియని గుబులు పట్టుకుంది.

మొత్తానికి గురి తప్పింది

ఈటల టార్గెట్​గా గురి పెట్టిన బాణం గతి తప్పినట్లైంది. ప్రభుత్వం నుంచి వచ్చిన వివరాలే ఇప్పుడు సర్కారుకు చిక్కుముడిలా చుట్టుకుంటున్నాయి. అటువైపు ప్రతిపక్ష కాంగ్రెస్​ దీనిపై అందరినీ బయటకు లాగే ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పటిలాగే… కేవలం టార్గెట్​ను మాత్రమే బలిచేస్తామనే పట్టుతో అధికార పార్టీ ఉన్నా దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు గురి కావాల్సి వస్తుందనే భయం కూడా ఉంటోంది. దీనిపై ఎలా తప్పించుకోవాలనేదే ఇప్పుడు ముందున్న సవాల్​.

ఇలాంటి పరిణామాల్లో రాష్ట్రంలో మరో చర్చ మొదలైంది. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, సీఎం అనుంగ అనుచరులను ఎంపీ రేవంత్​రెడ్డి టార్గెట్​ చేసినా… మల్లారెడ్డిపై వేటు పడే అవకాశం ఉందని పార్టీ నేతల్లోనే ప్రచారం. మల్లారెడ్డికి ఉద్వాసన పలికి… ఓ ఎమ్మెల్సీని మంత్రివర్గంలోకి తీసుకుంటారని, ఇలాచేస్తేనే దేవరయాంజల్​భూ కబ్జాలపై సీఎం కోటరీ తప్పించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed